రూ. 620 కోట్ల ప్రాజెక్టు; ఆరోపణలు కొట్టిపారేసిన ఐపీఎస్‌

28 Dec, 2020 10:38 IST|Sakshi

బెంగళూరు:  నిర్భయ పథకం కింద చేపట్టిన బెంగళూరు సేఫ్‌ సిటి ప్రాజెక్టు టెండర్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయన్న ఐపీఎస్‌ అధికారిణి రూపా ఆరోపణలను నగర అదనపు పోలీస్‌ కమిషనర్ హేమంత్‌ నింబాళ్కర్‌ కొట్టిపారేశారు. తాము అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని, ఎవరికీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. టెండరింగ్‌ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, సాక్ష్యాధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదన్నారు. కాగా మహిళలు, చిన్నారుల భద్రత పర్యవేక్షణకై 7 వేలకు పైగా సీసీటీవీల ఏర్పాటు సహా ఇతర సురక్షిత చర్యలకై  సుమారు రూ. 620 కోట్ల భారీ వ్యయంతో బెంగళూరు సేఫ్‌ సిటి ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో భాగంగా టెండర్లు ఆహ్వానించే, స్క్రూటినీ చేసే కమిటీకి హేమంత్‌ నింబాళ్కర్‌ను చైర్మన్‌గా నియమించారు.

ఈ నేపథ్యంలో ఒక కంపెనీకి హేమంత్‌  అనుకూలంగా పనిచేస్తున్నారంటూ రూపా సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించిన హేమంత్‌ నింబాళ్కర్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘జనవరి 8 నాటికి టెండర్ల దాఖలు ప్రక్రియ పూర్తవుతుంది. అప్పుడే ఎవరు టెండర్‌ వేశారన్న విషయంపై ఒక స్పష్టత వస్తుంది. ఇదొక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. టెండరింగ్‌కు సంబంధించి కొందరికి లబ్ది చేకూరేలా వ్యవహరిస్తున్నామంటూ సోషల్‌ మీడియాలో ప్రచురితమవుతున్న కథనాలు నా దృష్టికి వచ్చాయి. టెండర్ల విషయంలో మేం పూర్తి పాదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ప్రతీ అంశాన్ని రికార్డు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

అదే విధంగా.. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అక్రమ పద్ధతుల్లో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి నుంచి కీలక విషయాలు సేకరిస్తున్నారంటూ రూపాను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు. సాంకేతిక అర్హత పొంది తక్కువ ధరకు నమోదు చేసిన వారికే బిడ్‌ దక్కుతుందని స్పష్టం చేశారు. ఇక ఇందుకు రూపా సైతం దీటుగా బదులిచ్చారు. ఈ మేరకు.. ‘‘హేమంత్‌ నింబాళ్కర్‌, ఐపీఎస్‌, నిర్భయ టెండర్‌ ఇన్వైటింగ్‌ కమిటీ, టెండర్‌ స్క్రూటిని కమిటి చైర్మన్‌ ఈరోజు అంటే 27.12.20న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని, ప్రసార మాధ్యమాలు, ప్రజలను తప్పుదోవపట్టించేలా మరోసారి అసత్యాలు చెప్పారు’’ అని ప్రకటన విడుదల చేశారు. కాగా టెండర్ల విషయంలో ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.(చదవండి: రూ.250 భోజనం ఆర్డర్‌.. రూ.50 వేలు మాయం)

మరిన్ని వార్తలు