ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను వేధించిన ట్రాఫిక్ పోలీసులు.. సృహతప్పి పడిపోయిన భార్య..

7 Feb, 2023 17:10 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక బెంగళూరు ట్రాఫిక్ ఫోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు.  చికిత్స కోసం బైక్‌పై ఆస్పత్రికి వెళ్తున్న దంపతులను ఆపి వేధించారు. పెండింగ్‌లో ఉన్న రూ.5,000 ట్రాఫిక్ చలాన్లు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బైక్‌ను సీజ్ చేస్తామని బెదిరించారు.

తన భార్య డయాబెటిస్ చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్తున్నామని, పెండింగ్‌ చలాన్లు తర్వాత కడతామని భర్త వేడుకున్నా ట్రాఫిక్ పోలీసులు కనికరించలేదు. దీంతో చికిత్స కోసం తెచ్చుకున్న రూ.2,000 చెల్లిస్తామని, మిగతా మొత్తం తర్వాత కడతామని దంపతులు విజ్ఞప్తి చేశారు. అయినా ట్రాఫిక్ పోలీసులు మాత్రం జాలి చూపలేదు. మొత్తం రూ.5,000 చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు.

ఇక గత్యంతరం లేదని భావించిన భర్త మిగతా డబ్బు తెచ్చేందుకు ఇంటికి నడుచుకుంటూ వెళ్లాడు. అతని కోసం బైక్ వద్దే ఎదురు చూసిన భార్య కాసేపటికే సృహతప్పి పడిపోయింది.

ట్రాఫిక్ పోలీసుల తీరుతో తీవ్ర ఆగ్రహం చెందిన ఈ దంపతుల కుమారుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అత్యంత కఠినంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బెంగళూరులోని సంగం సర్కిల్‌లో ఫిబ్రవరి 2న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
చదవండి: అదానీ మ్యాజిక్ ఏంటో చెబితే అందరూ కోటీశ్వరులవుతారు కదా..!

మరిన్ని వార్తలు