బెంగళూరులో వరద విలయం.. ట్రాక్టర్లలో ఆఫీసులకు ఐటీ ఉద్యోగులు

7 Sep, 2022 08:42 IST|Sakshi

నీటిలోనే కాలనీలు, రహదారులు 

ట్రాక్టర్లలో ఆఫీసులకు ఐటీ ఉద్యోగులు 

బెంగళూరు: ఐటీ నగరి బెంగళూరును వరద కష్టాలు వదలడం లేదు. ఆదివారం రాత్రి నుంచి కురిసిన కుండపోతకే నగరం అల్లాడిపోగా మంగళవారం కూడా భారీ వర్షం కురవడంతో పరిస్థితి పులిమీద పుట్రలా మారింది. గత 42 సంవత్సరాల్లో ఎన్నడూ చూడనంతటి వర్షం కురవడంతో నగరంలో 164 చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. ద్విచక్ర వాహనాలు, ఖరీదైన కార్లు వర్షార్పణం కావడంతో చివరికి రవాణాకు ట్రాక్టర్లు దిక్కయ్యాయి!

ఎక్కడ చూసినా జనాన్ని తరలిస్తున్న ట్రాక్టర్లే దర్శనమిచ్చాయి. ఐటీ ఉద్యోగులు కూడా ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళ్లారు.  ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ సంస్థ అన్‌అకాడమీ వ్యవస్థాపకుడు గౌరవ్‌ ముంజల్‌ జలమయమైన తన నివాసం నుంచి ట్రాక్టర్‌లోనే కుటుంబీకులతో సహా సురక్షిత ప్రాంతానికి వెళ్లారు! స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని త్వరలో చక్కదిద్దుతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై చెప్పారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యాల వల్లే బెంగళూరులో ఇలాంటి సమస్యలని విమర్శించారు. 

బెల్లందూర్‌లో చేతికందిన సామాన్లతో వరద నీటి గుండా వెళ్తున్న జనం

సోషల్‌ మీడియాలో జోకులు, విమర్శలు
కుండపోత వర్షంపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ‘బెంగళూరు వెనిస్‌లా మారింది’, ‘నగరమే వాటర్‌ పార్క్‌గా మారినప్పుడు ఇక వండర్‌లా అవసరమా?’, ‘ఖరీదైన కార్లు నీళ్లలో ఈదులాడుతుంటే రవాణాకు ట్రాక్టర్లే దిక్కయ్యాయి’ అంటూ పోస్టులు పెట్టారు. ముడుపుల పాలన అంటూ ఆగ్రహించారు.

బెల్లందూర్‌లో జలమయమైన ఇంటెల్‌ ముఖద్వారం

మరిన్ని వార్తలు