కారుపై వేలాడుతూ యువకుడు.. కిలోమీటర్‌ పైనే ఈడ్చుకెళ్లిన యువతి

20 Jan, 2023 17:12 IST|Sakshi

క్రైమ్‌: అంజలి సింగ్‌ ఘటన దేశాన్ని కుదిపేసి నెల గడవక ముందే.. దాదాపు ఆ తరహా ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ దాదాపు అలాంటి ప్రమాదం నుంచే బయటపడ్డారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం బెంగళూరులో ఓ వ్యక్తిని కిలోమీటర్‌ దూరం ఈడ్చుకెళ్లింది ఓ యువతి. 

బెంగళూరు జ్ఞానభారతి నగర్‌లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రియాంక అనే యువతి.. తన వాహనంపై దర్శన్‌ అనే యువకుడిని కిలోమీటర్‌ పైనే దూరం ఈడ్చుకెళ్లింది. అంతకు ముందు ఇద్దరి కార్లు యాక్సిడెంట్‌కి గురికావడం, పరస్పర వాగ్వాదం తర్వాతే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు. 

టాటా నెక్సన్‌ వాహనంలో దూసుకొచ్చిన ప్రియాంక తన మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ కారును ఢీ కొట్టింది. దీంతో కారులోని దర్శన్‌.. ఆమెను బయటకు రావాలంటూ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆమె అసభ్య సైగ(మధ్య వేలు చూపించడంతో) చేయడం వివాదం మరింత ముదిరింది. దర్శన్‌ మాట లెక్కచేయకుండా ఆమె కారును ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేసింది. దీంతో బానెట్‌పై వేలాడుతూ అలాగే ఉండిపోయాడు దర్శన్‌. కారు ఆపమని చుట్టుపక్కల జనాలు, వాహనదారులు మొత్తుకున్నా.. ఆమె పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. ఆపై కిలోమీటర్‌ పైనే వెళ్లాక.. కారు స్లో కాడంతో అతను పక్కకు దూకేశాడు. 

కాస్త ముందుకు వెళ్లాక ఉల్లాల్‌ రోడ్‌లో ప్రియాంక కారు ఆపగా.. తన స్నేహితుల సాయంతో ఆ కారును ధ్వంసం చేశాడు దర్శన్‌. ఆపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసులు నమోదు అయ్యాయి. హత్యాయత్నం అభియోగం కింద ప్రియాంకపై కేసు నమోదు కాగా, దర్శన్‌తో పాటు మరో ముగ్గురిపై.. యువతిని వేధించడం, దాడి చేయడం లాంటి అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ (ట్రాఫిక్‌ వెస్ట్‌) వెల్లడించారు.

మరిన్ని వార్తలు