హైదరాబాద్‌-బెంగళూరు మధ్య హైస్పీడ్‌ ట్రైన్‌.. ఇక జర్నీ 2.5 గంటలే!

17 Aug, 2022 11:35 IST|Sakshi

బెంగళూరు: దేశంలో ఐటీ హాబ్‌లుగా మారాయి బెంగళూరు, హైదరాబాద్‌ మహానగరాలు. ఈ పట్టణాల మధ్య నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే, రోడ్డు, రైలు మార్గంలో చేరుకోవాలంటే సుమారు 10 గంటలపైనే సమయం పడుతుంది. అయితే, కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకుంటే ఎంతో సమయం ఆదా అవుతుంది కదా? ఆ కల త్వరలోనే నిజం కాబోతోంది. దక్షిణాది ఐటీ హబ్‌లైన బెంగళూరు, హైదరాబాద్‌ల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయాలని భావిస్తోంది భారతీయ రైల్వే. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలపైకి రానుంది. 

ఇండియా ఇన్‌ఫ్రాహబ్‌ నివేదిక ప్రకారం.. సెమీ హైస్పీడ్‌ ట్రాక్‌ను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ట్రైన్లు దూసుకెళ్లేలా నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం రెండున్నర గంటలకు తగ్గనుంది. కొత్త ట్రాక్‌ను బెంగళూరులోని యెలహంకా స్టేషన్‌ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకు సుమారు 503 కిలోమీటర్లు నిర్మించనున్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. సుమారు రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఈ హైస్పీడ్‌ ట్రాక్‌ నిర్మాణానికి కావాల్సిన రూట్‌ను ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ట్రాక్‌కు ఇరువైపులా 1.5 మీటర్ల ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ట్రైన్‌ హైస్పీడ్‌తో దూసుకెళ్లనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మధ్య రైలులో ప్రయాణించేందుకు సుమారు 10 నుంచి 11 గంటల సమయం పడుతోంది. మరోవైపు.. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణంపై రాజ్యసభలో ఇటీవలే ప్రకటించారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.

ఇదీ చదవండి: గూడ్స్‌ ట్రైన్‌ను ఢీకొట్టి పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు.. 50మందికి గాయాలు!

మరిన్ని వార్తలు