ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హౌజ్‌ అరెస్ట్‌

8 Dec, 2020 13:47 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతు సంఘాలు పిలునిచ్చిన ‘భారత్ బంద్’ కొనసాగుతుంది. రైతులకు దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రైతులకు మద్దతుగా పలు సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ‘భారత్ బంద్’ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్‌లో ఓ పోస్ట్ చేసింది. సింఘా సరిహద్దుల్లో రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి వచ్చినప్పటీ నుంచి ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆప్‌ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసం నుంచి ఎవరూ బయటకు వెళ్లడానికి కానీ, బయటవారు లోనికి ప్రవేశించడానికి కానీ పోలీసులు అనుమతించడం లేదని ఆరోపించింది. ఈ మేరకు ఆప్‌ లీడర్‌ సౌరవ్‌ భరద్వాజ్‌ ‘ఆయనను బయటకు రానీవ్వడం లేదు.. మమ్మల్ని ఎవరిని లోనికి అనుమతించడం లేదు. నిన్న ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యేలను పోలీసులు కొట్టారు. పని వారిని కూడా లోనికి వెళ్లనివ్వడం లేదు. ఆయన నివాసం బయట బీజేపీ నాయకులు బైఠాయించారు’ అంటూ ట్వీట్‌ చేశారు. (మా రాష్ట్రంలో బంద్‌ పాటించం: సీఎం)

అయితే ఆప్ వ్యాఖ్యలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. కేజ్రీవాల్‌ను గృహ నిర్భంధంలో ఉంచామని చెప్పడం అవాస్తమని అన్నారు. తాము ఆప్, ఇతర పార్టీల మధ్య ఘర్షణ తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు. ఈ క్రమంలోనే ట్విటర్‌లో కేజ్రీవాల్ నివాసం వద్ద ఎలా ఉందో చూడండి అని ఓ ఫొటోను పోస్ట్ చేసింది.దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ కూడా స్పందించింది. పోలీసులకు, ఆప్ ఎమ్మెల్యేలకు మధ్య వాగ్వాదం జరుగుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసిన ఆప్.. ఆధారాలను తారుమారు చేయవద్దని కోరింది. ఈ వీడియో ఏమిటో చెప్పాల్సిందిగా పోలీసులను ప్రశ్నించింది. తమ ఎమ్మెల్యేలను సీఎం కేజ్రీవాల్‌ను కలవడానికి అనుమతించకుండా ఎందుకు లాగివేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించింది. (చదవండి: పాత చట్టాలతో కొత్త శతాబ్దం నిర్మించలేం)

ఇక, సోమవారం రోజున సింఘా సరిహద్దుల్లో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులను క్రేజ్రీవాల్ కలిశారు. రైతుల డిమాండ్లు సమ్మతమైనవేనని, వారి డిమాండ్లకు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధర అంశాన్ని వ్యవసాయ చట్టాల్లో చేర్చాల్సిందిగా ఆప్ పార్లమెంట్‌లో కేంద్రాన్ని కోరిన విషయన్ని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు