భారత్‌ బయోటెక్‌ మరో గుడ్‌న్యూస్‌

22 Nov, 2020 10:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌  ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తొలి దశలో కోవిడ్‌ సృష్టించిన విలయం మరువరక ముందే మరోసారి వైరస్‌ విజృంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే భయం వెంటాడుతోంది. ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యం సంస్థ సైతం హెచ్చరికలు జారీచేసింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. శాస్త్రవేత్తలు అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఇక భారత్‌లోనూ వ్యాక్సిన్‌ తయారీ ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ వరుసలో దేశీయ కంపెనీ భారత్‌ బయోటెక్‌ ముందంజలో ఉంది. (ఇంకోసారి లాక్‌డౌన్‌ అవసరమా?) 

తమ సంస్థ ఉత్పత్తి చేస్తున్న ‘కోవాగ్జిన్’ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లోకి ప్రవేశించిందని భారత్ బయోటెక్ ఇది వరకే ప్రకటించింది. తాజాగా మరో కీలక విషయాన్ని వెల్లడించింది. తాము రూపొందిస్తున్న కోవాక్సిన్‌ 60 శాతం ప్రభావం చూపింస్తుందని, వచ్చే ఏడాది ద్వితియార్థంలో దీనిని అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది. వైరస్‌పై పోరులో తమ వ్యాక్సిన్‌ మంచి ఫలితాన్ని ఇస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ సంస్థ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్‌ ప్రసాద్‌ ఆదివారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో 25 కేంద్రాల్లో 26,000 మంది వాలంటీర్లతో ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో కరోనా వ్యాక్సిన్ కోసం నిర్వహించిన అతిపెద్ద క్లినికల్ ట్రయల్ ఇదేనని వెల్లడించారు. కోవాగ్జిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ తాత్కాలిక విశ్లేషణ విజయవంతంగా పూర్తి అయిందని ఇటీవల సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు