జంతువులపై సత్ఫలితాలిచ్చిన కోవాక్జిన్

11 Sep, 2020 21:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్ని కరోనా వ్యాక్సిన్‌ కోసం తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందరి చూపు ఆక్స్‌ఫోర్డ్‌ ఆస్ట్రాజెనెకా మీదనే ఉండగా.. అనూహ్యంగా ఆ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి మరింత ఆలస్యమవుతుందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ బయోటెక్‌ శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కోవాక్జిన్‌ జంతువుల్లో సత్ఫలితాలిచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ ట్వీట్‌ చేసింది.

‘జంతువులపై కోవాక్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలిచ్చాయని గర్వంగా తెలియజేస్తున్నాం. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో ఇమ్యూనిటీ పెరిగింది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్ వృద్ధిని నియంత్రించినట్టు గుర్తించాము. రెండో డోస్ ఇచ్చిన 14రోజుల తర్వాత మరోసారి జంతువులను పరిశీలిస్తాం’ అంటూ భారత్‌ బయోటెక్‌ ట్వీట్‌ చేసింది. ఇక ఇప్పటికే నిమ్స్‌లో కోవాక్జిన్ రెండో దశ హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. (చదవండి: ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ఆగిందా?)

>
మరిన్ని వార్తలు