Covaxin: 18 ఏళ్లలోపు వారికి కరోనా టీకా..

22 Sep, 2021 09:02 IST|Sakshi

భారత్‌ బయోటెక్‌ ఫేజ్‌ 2/3 ట్రయల్స్‌ పూర్తి

వచ్చే వారం డీసీజీఐకి నివేదిక 

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ 18 ఏళ్లలోపు వారికి ఇచ్చే కోవాగ్జిన్‌ టీకా ఫేజ్‌ 2/3 ట్రయల్స్‌ పూర్తి చేసింది. 18 ఏళ్లు పైబడిన వారి కోసం ఇదే సంస్థ ఇప్పటికే కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. పిల్లల కోసం అభివృద్ధి చేస్తున్న టీకాకు సంబంధించిన ఫేజ్‌ 2/3 ట్రయల్స్‌ వివరాలను వచ్చేవారం డీసీజీఐ(డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా)కి సమర్పించనున్నట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్లా మంగళవారం తెలిపారు.

18 ఏళ్లు దాటిన వారి కోసం కోవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తి అక్టోబర్‌లో 55 మిలియన్‌ డోసులకు చేరుతుందని అన్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే 35 మిలియన్‌ డోసులు ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా అభివృద్ధి ప్రక్రియ కొనసాగుతోందని, ఫేజ్‌ –2 ట్రయల్స్‌ వచ్చే నెలలో ముగియనుందని వివరించారు. వైరస్‌ మనిషి శరీరంలోకి ప్రవేశించేందుకు ముఖద్వారం ముక్కేనని చెప్పారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకాతో ముక్కులో ఇమ్యూన్‌ రెస్సాన్స్‌ పెరుగుతుందని వెల్లడించారు. తద్వారా వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.

ముక్కు ద్వారా ఇచ్చే టీకా ట్రయల్స్‌ను 650 మంది వలంటీర్లపై నిర్వహించామని చెప్పారు. కేంద్రం అనుమతిస్తే కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కృష్ణ ఎల్లా తెలిపారు. ఇప్పటికిప్పుడు విదేశీ మార్కెట్లలో పాగా వేయాలన్న ఆరాటం తమకు లేదన్నారు. 

మరిన్ని వార్తలు