హైదరాబాద్‌ టీకాకు ఓకే

3 Jan, 2021 04:46 IST|Sakshi

కోవాగ్జిన్‌ అత్యవసర వాడకానికి నిపుణుల కమిటీ ఆమోదం

అనుమతులు పొందిన తొలి దేశీ వ్యాక్సిన్‌

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తి చేసిన కోవాగ్జిన్‌ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ(కేంద్ర ఔషధాల ప్రమాణిక నియంత్రణ సంస్థ) నియమించిన నిపుణుల కమిటీ శనివారం ఆమోదం తెలిపింది. టీకాకు సంబంధించి కంపెనీ సమర్పించిన ట్రయిల్స్‌ డేటాను పరిశీలించిన అనంతరం కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్‌ రూపొందించిన కోవిషీల్డ్‌ టీకా భారత్‌లో వినియోగానికి ఆమోదముద్ర సంపాదించిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం కోవాగ్జిన్‌ రెండు దశల ట్రయిల్స్‌ పూర్తి చేసుకుంది.

ఈ రెండిటిలో సత్ఫలితాలు వచ్చినందున టీకా అత్యవసర వినియోగానికి నిపుణులు అంగీకారం తెలిపారు. ఫేజ్‌3 ట్రయిల్స్‌ కొనసాగించమని సూచించారు. ఐసీఎంఆర్‌ సహకారంతో భారత్‌ బయోటెక్‌ ఈ టీకాను రూపొందించింది. కోవాగ్జిన్‌ వినియోగానుమతుల కోసం భారత్‌ బయోటెక్‌ గతనెల 7న డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. కోవాగ్జిన్‌తో పాటు కోవిషీల్డ్‌ వినియోగంపై డీసీజీఐ అంతిమ ఆమోదం తెలపాల్సిఉంది. మరోవైపు కాడిలా రూపొందిస్తున్న టీకాపై ఫేజ్‌ 3 ట్రయిల్స్‌ జరపవచ్చని కూడా నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.

తర్వాతేంటి?
టీకాల వినియోగానికి డీసీజీఐ పచ్చజండా చూపిన అనంతరం ఆయా కంపెనీలు తమ టీకాను మార్కెట్‌లో ఆథరైజ్‌ చేసేందుకు, భారీగా ఉత్పత్తి చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆతర్వాతే మార్కెట్‌లోకి టీకాను తీసుకురావడానికి వీలవుతుంది. ఒక వ్యాధికి  ప్రత్యామ్నాయ చికిత్సలేవీ అందుబాటులో లేవన్నప్పుడు కొన్ని ఔషధాలు లేదా టీకాల అత్యవసర వినియోగం కోసం ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతి ఇస్తారు. ప్రస్తుతం కరోనాకు సరైన చికిత్స లేకపోవడం, మరోవైపు కొత్త స్ట్రెయిన్‌ గుర్తింపు నేపథ్యంలో ఆయా దేశాలు కోవిడ్‌ టీకాలకు అత్యవసర అనుమతులు ఇస్తున్నాయి.

ఇలాంటి అత్యవసర అనుమతులు పొందిన వ్యాక్సిన్‌ ఇచ్చే ముందు ప్రతి రోగి నుంచి ముందస్తు అనుమతి పత్రం తీసుకుంటారు. అలాగే సదరు టీకా వల్ల తలెత్తే అవకాశమున్న దుష్ప్రభావాల గురించి రోగికి, వారి కుటుంబ సభ్యులకు ముందుగానే వివరిస్తారు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాక ముందే మధ్యంతర ఫలితాల ఆధారంగా అనుమతులు ఇస్తున్నందున ఈ షరతులు విధిస్తారు. అతి త్వరలో ముందుగా నిర్ణయించిన ప్రాధాన్య క్రమంలో టీకాను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఆదివారం రోజు డీసీజీఐ పత్రికా సమావేశం నిర్వహించనుంది. ఇందులో టీకాల అనుమతిపై వెల్లడించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు