ఈ లక్షణాలుంటే కోవాగ్జిన్‌ టీకా తీసుకోవచ్చా?

19 Jan, 2021 12:57 IST|Sakshi

కీలక మార్గదర్శకాలు జారీ చేసిన భారత్ ‌బయోటెక్‌

సాక్షి, ముంబై: ఒకవైపు కరోనా  మహమ్మారి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు  సీరం వ్యాక్సిన్‌ తీసుకున్న 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారన్న వార్తలు  ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి దేశీయ కరోనా వ్యాక్సిన్‌ కోవాగ్జిన్‌కు సంబంధించి భార‌త్‌ బ‌యోటెక్  కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.  ఇటీవల కోవాగ్జిన్‌ టీకా దుష్ప్రభావాలపై పలు విమర్శలు వచ్చిన క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా  తాజా సూచనలు జారీ చేసింది. ఎవరు తమ టీకాను  తీసుకోకూడదు, ఎవరు తీసుకోవచ్చు  అనే వివరాలతో ఒక  వివరణాత్మక ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసింది. ముఖ్యంగా  బ‌ల‌హీన‌మైన ఇమ్యూనిటీ ఉన్నవారు, రోగ‌నిరోధ‌క శ‌క్తి వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం చూపే మందులు వాడేవారు,  అల‌ర్జీ ఉన్న‌వారు తమ కోవాగ్జిన్ టీకాను తీసుకోవద్దు అని భార‌త్ బ‌యోటెక్‌ హెచ్చరించింది. 

భారత్ బయోటెక్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం రక్తస్రావ లోపాలు లేదా బ్లడ్‌ థిన్నర్స్‌ వాడేవారు టీకా తీసుకోకపోవడం మంచిది. అలాగే జ్వరం లేదా అలెర్జీ  ఉన్నవారు, గర్భిణీ,  పాలిచ్చే తల్లులు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవద్దని సూచించింది. దీనితోపాటు మ‌రో కంపెనీ టీకా తీసుకున్న వారు కోవాగ్జిన్‌ టీకా వాడ‌వ‌ద్దని కూడా  హెచ్చరించింది. వ్యాక్సిన్ ‌డోస్‌ తీసుకున్న తర్వాత ఎవరైనా కోవిడ్-19 లక్షణాలను కనిపిస్తే, దాన్ని ఆర్టీ-పీసీఆర్ పరీక్ష ఆధారంగా "ప్రతికూల సంఘటన" గా పరిగణిస్తారని పేర్కొంది.

కాగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌ సయుక్తంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ రూపొందిస్తోంది. ఇప్పటికీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. అత్యవసర ఉపయోగం కోసం కేంద్రం అనుమతి పొందిన రెండు సంస్థల్లో భారత్‌ బయెటెక్‌ ఒకటి. జనవరి 16 నుంచి  దేశ‌వ్యాప్తంగా టీకాల కార్యక్రమం మొద‌లైన విష‌యం తెలిసిందే.  

మరిన్ని వార్తలు