Covaxin 3rd Phase Trial Results:మూడో దశ ట్రయల్స్‌ ఫలితాల రిపోర్ట్‌ విడుదల

3 Jul, 2021 09:21 IST|Sakshi

కోవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్‌ ఫలితాల రిపోర్ట్‌ విడుదల చేసిన భారత్‌ బయోటెక్‌

నూఢిల్లీ: కోవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్ ఫలితాల రిపోర్టును భారత్‌ బయోటెక్‌ కంపెనీ శనివారం రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఈ వ్యాక్సిన్ ఓవరాల్‌గా 78 శాతం సమర్థవంతంగా పని చేస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే... ప్రపంచాన్ని ప్రస్తుతం భయపెడుతున్న డెల్టా వేరియంట్ విషయంలో ఇది 65.2 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ కంపెనీ... మెడ్‌జివ్‌లో ప్రచురించింది. ఇండియాలో జరిగిన అతిపెద్ద ఎఫికసీ ట్రయల్‌లో కోవాగ్జిన్ సేఫ్ వ్యాక్సిన్ రుజువైంది అని కంపెనీ తెలిపింది.

నవంబర్ 16, 2020లో జరిగిన మూడో దశ ట్రయల్స్‌లో 25,798 మంది పాల్గొన్నారు. మొదటి డోస్ తీసుకున్నారు. అలాగే... జనవరి 7, 2021న 24,419 మంది రెండో డోసు తీసుకున్నారు. "వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఎవరూ చనిపోలేదు. కోవిడ్ వ్యాధిని నిర్మూలించడంలో... ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసింది. ముఖ్యంగా పెద్దవాళ్లలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి ఇది బాగా పనిచేసింది" అని కంపెనీ తెలిపింది.

మొత్తం 146 రోజులపాటూ... వ్యాక్సిన్ వేసుకున్న వారిని పరిశీలించారు. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ పూర్తి చేయడం ద్వారా... అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కరోనా వ్యాక్సిన్ తయారు చెయ్యగలవు అని నిరూపించినట్లు అయ్యింది అని భారత్ బయోటెక్ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. దేశంలోని మొత్తం 25 ఆస్పత్రుల్లో మూడో ట్రయల్స్ జరిగాయి. ఇందులో వ్యాక్సిన్ సామర్ధ్యం, సురక్షితమా కాదా... వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతోంది అనే అంశాల్ని పరిశీలించారు. తీవ్రమైన కేసుల్లో ఇది 93.4 శాతం సమర్థతతో పనిచేస్తోందని కంపెనీ తెలిపింది.

మరిన్ని వార్తలు