Bharat Jodo Yatra: జోడో యాత్రలో వివాదాస్పద కంప్యూటర్‌ బాబా.. బదులివ్వాలన్న బీజేపీ

4 Dec, 2022 05:41 IST|Sakshi

అగర్‌మాల్వా(మధ్యప్రదేశ్‌): కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో శనివారం వివాదాస్పద గురువు నాందేవ్‌ దాస్‌ త్యాగి అలియాస్‌ కంప్యూటర్‌ బాబా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో మహుదియా గ్రామం వద్ద శనివారం ఆయన రాహుల్‌తో కలిసి నడిచారు. ఇండోర్‌ సమీపంలోని తన ఆశ్రమంలోని అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై చేయి చేసుకున్న కేసులో నాందేవ్‌ 2020లో అరెస్టయ్యారు.

అలాంటి పలు కేసులున్న, జైలుకు వెళ్లొచ్చిన నిందితునితో రాహుల్‌తో కలిసి నడవడమేంటని బీజేపీ నిలదీసింది. అయితే, దేశ క్షేమం కోసం చేపట్టిన యాత్రలోకి సాధువులతో సహా అందరూ ఆహ్వానితులేనని కాంగ్రెస్‌ బదులిచ్చింది. అయితే ఈ కంప్యూటర్‌ బాబాకు 2018లో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సహాయ మంత్రి హోదాతో కూడిన  పదవి కట్టబెట్టింది! అనంతరం బీజేపీతో పొసగక ఆయన కాంగ్రెస్‌ పంచన చేరారు.

జోడో యాత్రలో పాల్గొన్నందుకు మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్‌ను శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. దీనిపై కాంగ్రెస్‌ మండిపడింది. ఆరెస్సెస్‌ సమావేశాల్లో పాల్గొనే ప్రభుత్వోద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు