భారత్‌ జోడో యాత్రలో విషాదం.. జైరాం రమేశ్‌తోపాటు నడుస్తూ కుప్పకూలిన సీనియర్‌నేత

8 Nov, 2022 17:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో మంగళవారం విషాదం నెలకొంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కాంగ్రెస్‌ సేవాదళ్‌ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌ పాండే (75) కన్నుమూశారు. నాగ్‌పూర్‌కు చెందిన కృష్ణకుమార్‌ మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు జైరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌తో కలిసి పాదయాత్ర చేసే క్రమంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు.

ఈ విషయంపై జైరాం రమేశ్‌ మాట్లాడుతూ.. కృష్ణకుమార్‌ హఠాన్మరణం కలచివేసిందని అన్నారు. ‘దిగ్విజయ్‌ సింగ్‌, నాతోపాటు కృష్ణకుమమార్‌ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం చేత ధరించి నడిచారు. కొద్దిదూరం వెళ్లాక పక్కనున్న వ్యక్తికి జెండా అప్పగించి.. గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పారు. ఆస్పత్రికి తరలించేలోపే ఘోరం జరిగిపోయింది’ అని పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు పాండే పార్టీ కోసం పనిచేశారని జైరాం రమేశ్‌ గుర్తు చేసుకున్నారు. 
(చదవండి: గుజరాత్‌ బీజేపీ సర్కార్‌పై చిదంబరం ఫైర్‌.. తీగల వంతెన ప్రమాదంపై సీరియస్‌)

కాగా, కృష్ణకుమార్‌ భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి భారత్‌ జోడో యాత్ర జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. అక్కడ రాహుల్‌ గాంధీ, ఇతర నాయకులు, కార్యకర్తలు దివంగత నాయకునికి నివాళి అర్పించారు. అనంతరం తండ్రితోపాటు పాదయాత్రలో పాల్గొన్న కృష్ణకుమార్‌ కుమారుడు షీలాజ్‌ పాండేకు భౌతికకాయాన్ని అప్పగించారు.

కృష్ణకుమార్‌ అకాల మృతిపట్ల రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ కుటుంబానికి కృష్ణకుమార్‌ మృతి ఎంతో బాధాకరమని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆయన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తన చివరి క్షణాల్లో కూడా ఆయన జాతీయ జెండా మోయడం దేశ పట్ల ఆయన అంకితభావాన్ని తెలియజేస్తుందని అన్నారు.

యాత్రా బృందంలో 25 మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారని మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ అశోక్‌ చవాన్‌ తెలిపారు. అయితే, వయసుపైబడ్డ యాత్రికులకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ముందుగానే పరీక్షలు నిర్వహించి యాత్రలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మంగళవారం సాయంత్రం జరిగే సభ.. పాండే సంస్మరణ సభగా జరుపుతామని వెల్లడించారు.
(చదవండి: ప్రజల్ని కలుస్తూ.. సమస్యలు వింటూ..)

మరిన్ని వార్తలు