Bharat Jodo Yatra: దేశ పునర్నిర్మాణం కోసమే ‘జోడో’

26 Sep, 2022 05:40 IST|Sakshi
ఇందిరాగాంధీ ఆహార్యంతో ఉన్న చిన్నారి, ఎంపీ రమ్య హరిదాస్‌తో రాహుల్‌

ప్రజలంతా పాల్గొనాలి: కాంగ్రెస్‌ వినతి

త్రిసూర్‌: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆదివారం కేరళ రాష్ట్రం త్రిసూర్‌ జిల్లాలోని తిరూర్‌ నుంచి భారత్‌ జోడో యాత్రను ప్రారంభించారు. వందలాది మంది కార్యకర్తలు ఆయన వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. వంట గ్యాస్‌ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్‌ సిలిండర్ల ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఉదయం వడక్కంచెరీలో పాదయాత్ర ముగిసిన తర్వాత రాహుల్‌ హెలికాప్టర్‌లో నీలంబూర్‌కు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత అర్యదన్‌ మొహమ్మద్‌(87)కు నివాళులర్పించారు.

మొహమ్మద్‌ ఆదివారం మృతిచెందారు. పార్టీకి ఆయన అందించిన సేవలను రాహుల్‌ గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. దేశ పునర్నిర్మాణం కోసం తాము చేపట్టిన చరిత్రాత్మక భారత్‌ జోడోయాత్రలో ప్రజలంతా పాల్గొనాలని కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేసింది. బలమైన, స్వావలంబన భారత్‌ మనకు కావాలని పేర్కొంది. ఆదివారం రాహుల్‌ గాంధీ పాదయాత్రకు విశేషమైన ప్రజా స్పందన లభించింది. మహిళలు, పిల్లలు సెక్యూరిటీ వలయాన్ని చేధించుకొని రాహుల్‌ వద్దకు చేరుకున్నారు. ఆయనతో కలిసి ఫొటోలు తీసుకున్నారు.   
 

మరిన్ని వార్తలు