Bharat Jodo Yatra: మహిళలను వస్తువుల్లా... చూస్తున్న బీజేపీ

28 Sep, 2022 05:42 IST|Sakshi

రిసెప్షనిస్ట్‌ హత్యపై రాహుల్‌ ధ్వజం

మలప్పురం: మహిళలను ఒక వస్తువుగా చూసే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల భావజాలం ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్‌ హత్య ఘటనతో తేటతెల్లమైందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. భారత్‌ జోడో యాత్ర 20వ రోజు మంగళవారం మలప్పురం జిల్లాలో ప్రవేశించింది. తచ్చింగనాదం హైస్కూల్‌ వద్ద ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అంకితకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. రిసెప్షనిస్ట్‌ అంకితా భండారి హత్యోదంతంతో బీజేపీ నేత కుమారుడికి సంబంధముందన్న ఆరోపణలపై రాహుల్‌ స్పందించారు.

‘చెప్పినట్లు వినలేదనే అంకితను చంపేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవమిదే. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మహిళలను వస్తువులుగా రెండో తరగతి పౌరులుగా చూస్తున్నాయి. ఇది సిగ్గుచేటు. మహిళలను గౌరవించని, సాధికారిత కల్పించని దేశం ఏమీ సాధించలేదు’ అని ఆయన అన్నారు. ‘బీజేపీ నాయకులకు కావాల్సింది అధికారం. అధికారం దక్కాక, దానిని నిలుపుకునేందుకు ఏదైనా చేస్తారు. ఆ క్రమంలోనే అంకిత హత్యకు గురైంది’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. మహిళలను చిన్నచూపు చూడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వబోమనే హెచ్చరికను బీజేపీకి పంపాలని కోరారు.  ‘జస్టిస్‌ ఫర్‌ అంకిత, జస్టిస్‌ ఫర్‌ ఇండియన్‌ ఉమెన్, బీజేపీ సే బేటీ బచావో’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.  

మరిన్ని వార్తలు