భారత్‌ జోడో యాత్ర పునఃప్రారంభం

29 Jan, 2023 05:51 IST|Sakshi

రేపు శ్రీనగర్‌లో బహిరంగ సభ  

అవంతిపురా/శ్రీనగర్‌/న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ భారత్‌ జోడో యాత్ర జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం పునఃప్రారంభమైంది. రాహుల్‌ గాంధీ ఉదయం 9.20 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. భద్రతాపరమైన లోపాలున్నాయంటూ శుక్రవారం మధ్యాహ్నం యాత్రను నిలిపేయడం తెలిసిందే. దాంతో శనివారం మూడంచెల భద్రత కల్పించారు.  2019 ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలో ఉగ్రవాద దాడిలో మరణించిన 40 సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు రాహుల్‌ గాంధీ శనివారం నివాళులర్పించారు. జమ్మూ–శ్రీనగర్‌ జాతీయ రహదారిపై జైషే మొహమ్మద్‌ ఉగ్రవాది ఆత్మాహుతి దాడిలో బస్సు ధ్వంసమైన చోట పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

యాత్రలో ప్రియాంకా గాంధీ
భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంకాగాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు. శనివారం లెథ్‌పురాలో సోదరుడు రాహుల్‌ గాంధీపాటు పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దక్షిణ కశ్మీర్‌ జిల్లాలోని చుర్సూలో పీడీపీ అధ్యక్షురాలు మొహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం రాహుల్‌ గాంధీతోపాటు జోడో యాత్రలో పాల్గొన్నారు.  

తాజా గాలి పీల్చుకున్నట్లే ఉంది: ముఫ్తీ   
కశ్మీర్‌లో జోడో యాత్ర జరగడం తాజా గాలి పీల్చుకున్నట్లుగా ఉందని మెహబూబా ముఫ్తీ శనివారం ట్వీట్‌ చేశారు. 2019 తర్వాత తొలిసారిగా భారీ సంఖ్యలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చారని చెప్పారు. యాత్రలో రాహుల్‌ గాంధీతో కలిసి నడవడం గొప్ప అనుభవమని పేర్కొన్నారు.  షెడ్యూల్‌ ప్రకారం జోడో యాత్ర ఆదివారం ఉదయం పంథాచౌక్‌ నుంచి పునఃప్రారంభం కానుంది. శ్రీనగర్‌లో బోలివార్డ్‌ రోడ్డులోని నెహ్రూ పార్కు వరకూ యాత్ర సాగుతుంది. సోమవారం శ్రీనగర్‌ ఎంఏ రోడ్డులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో రాహుల్‌ గాంధీ జెండా ఎగురవేస్తారు. అనంతరం ఎస్‌కే స్టేడియంలో విపక్ష పార్టీల నేతలతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు.   

అమిత్‌ షాకు మల్లికార్జున ఖర్గే లేఖ  
జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న భారత్‌జోడో యాత్రకు తగిన భద్రత కల్పించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. యాత్రలో భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు