Bharat Jodo Yatra: విద్వేష రాజకీయాల నుంచి యువతను రక్షించాలి

10 Oct, 2022 05:17 IST|Sakshi

 కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ

తుమకూరు: విద్వేష రాజకీయాల నుంచి దేశ యువతను రక్షించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. విద్య, ఉపాధి అవకాశాలను వారికి     కల్పించి మంచి భవిష్యత్తును చూపాలన్నారు.  యువతను విద్వేషాల మంటల్లోకి నెట్టేవేయడం దేశ భవితను నాశనం చేస్తుందన్నారు. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో భారత్‌ జోడో యాత్ర ఆదివారం తుమకూరు జిల్లాలో రెండోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొందరు యువతీయువకులు పెరుగుతున్న నిరుద్యోగం, మత విద్వేషాలకు వ్యతిరేకంగా బ్యానర్లు ప్రదర్శిస్తూ యాత్రలో పాల్గొన్నారు.

రాహుల్‌ వారితో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. శాంతి, సోదరభావ సందేశాన్ని వ్యాపింపజేసి, దేశాన్ని ఐక్యంగా ఉంచే యాత్రలో పాల్గొనాలని ఆయన వారిని కోరారు. ‘కొన్ని రాజకీయ పార్టీలు తమ విద్వేష రాజకీయాల కోసం వారిని నిరుద్యోగులుగానే ఉంచుతూ తప్పుదోవపట్టిస్తున్నాయి. యువత మన దేశ భవిష్యత్తు. ఉపాధి చూపితే వారు తమ, కుటుంబ, దేశ భవిష్యత్తును నిర్మిస్తారు. మనదేశాన్ని మునుపటి మాదిరిగా అందమైన దేశంగా తయారు చేసుకుందాం’అని రాహుల్‌ పేర్కొన్నారు. చిక్కనాయకనహళ్లిలో చిన్నారులతో కలిసి కారులో కాసేపు ముచ్చటించారు.
చిన్నారులతో కలిసి కారులో రాహుల్‌ సరదా 

>
మరిన్ని వార్తలు