వాళ్లను పెళ్లికి పిలవొద్దు.. పిలిచారనుకో..

19 Feb, 2021 15:55 IST|Sakshi
నరేశ్‌ తికైత్‌

లక్నో : ప్రజలెవరూ భారతీయ జనతా పార్టీ నేతలతో ఎటువంటి సంబంధం పెట్టుకోవద్దని భారతీయ కిషాన్‌ యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు నరేశ్‌ తికైత్‌ ‘తుగ్లక్‌- ఇష్క్‌ దిక్తత్‌’ ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ నేతలను పెళ్లికి కూడా పిలవొద్దని, ఒక వేళ ఎవరైనా వారిని పెళ్లికి పిలిస్తే.. మరుసటి రోజు ఉదయం ఆ పెళ్లివారు 100 మంది బీకేయూ సభ్యులకు భోజనం పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌, సిసౌలీలోని మహా పంచాయత్‌లో తికైత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ రైతులను పట్టించుకోవటం లేదని, అందుకే కాషాయ పార్టీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదన్న నిర్ణయానికి వచ్చామని చెప్పారు. తాము రాముడి వారసులమని ఆయన అన్నారు. ( అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చిన ఎమ్మెల్యే )

అమిత్‌ షా రైతులతో మాట్లాడటం లేదు కానీ, తమ పూర్వీకుల(రాముడు అనే ఉద్దేశ్యంతో) పేరు చెప్పి పశ్చిమ బెంగాల్‌లో ఓట్లు అడుక్కుంటున్నారని మండిపడ్డారు. కాగా, రైతు ఉద్యమంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ గురువారం స్పందిస్తూ.. కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు చట్టాలపై రైతులతో చర్చలు జరపటానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం దశల వారీగా రైతులతో చర్చలు జరపటానికి వారిని పిలుస్తూనే ఉందని అన్నారు.

మరిన్ని వార్తలు