కోవిడ్‌ రిలీఫ్‌: ప్రాణాల్ని కాపాడుతున్న భిల్వారా మోడల్‌ 

29 Apr, 2021 12:22 IST|Sakshi

జైపూర్‌: ఓ వైపు కరోనా సెకండ్‌ వేవ్‌.. మరోవైపు ఆక్సిజన్‌ అందక ఎంతోమంది అభాగ్యులు తమ ప్రాణాల్ని కోల్పోతున్నారు. అయితే ఈ ఆపత్కాలంలో భిల్వారా మోడల్‌ సాయంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే కాకుండా, ఆక్సిజన్‌ అందక ప్రాణాలు కోల్పోతున్న వారిని రక్షించుకోవచ్చు. ఈ స‍్ట్రాటజీని ఉపయోగించే రాజస్థాన్‌ లోని 8 వేల మంది కరోనా బాధితులకు ఆక‍్సిజన్‌ అందించి ప్రాణాల్ని నిలబెట్టడం ఇందుకు ఉదాహరణగా నిలిచింది.  

ఇలా మొదలైంది..
గతేడాది భిల్వారా జిల్లాలో 430 పడకలున్న మహత్మాగాంధి ఆస్పత్రిలో  300 బెడ్లు కరోనా బాధితులతోనే నిండిపోయాయి. ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లు లేక స్ట్రెచ్చర్ల మీద, కారిడార్లలో వైద్యం కోసం నిరీక్షిస్తూ పేద కుటుంబాలు పడిగాపులు కాస్తూ కనపడ్డాయి. అయితే ఆ సమయంలో బెడ్ల సంగతి పక్కనపెడితే.. ఆక్సిజన్‌ సరఫరా చేస్తే కరోనా నుంచి బాధితులను రక్షించవచ్చని గాంధీ ఆస్పత్రి వైద్యులు భావించారు. వెంటనే ఆక్సిజన్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేయాలని రాజస్థాన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైద్యుల సలహాతో ప్రభుత్వం ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ ను ఏర్పాటు చేసింది. కరోనా మొదటి దశ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఆక్సీజన్‌ ప్లాంట్‌ ఇప్పుడు రాజస్తాన్‌లో 8 వేల మంది కరోనా బాధితులకు ప్రాణవాయువు అందిస్తోంది.

ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర​ అరుణ్‌ గౌర్‌ మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాధిగ్రస్తుల్ని రక్షించాలంటే ఆక్సిజన్‌ చాలా అవసరం. బెడ్ల లేవని గాబరా పడేకంటే.. బాధితులకు సత్వరం ఆక్సీజన్‌ అదించడం ముఖ్యం. గతేడాది అదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సీఎం అశోక్ గహ్లోత్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ బాధితులను ఆదుకుంటోంది. కరోనా బాధితులు పెరుగుతున్నప్పటికీ అందరికీ ఆక్సిజన్‌ సిలిండర్లను అందిస్తున్నాం. 

ప్రస్తుతం మేము సొంతంగా ఏర్పాటు చేయించిన ఫ్లాంట్‌ లో ప్రతిరోజు 100 ఆక్సిజన్‌ సిలిండర‍్లు ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర ఆక్సిజన్‌ ఫ్లాంట‍్ల నుంచి సిలిండర్లను తెప్పించుకుంటున్నాము. గతంలో మా ఆస్పత్రిలో  30 నుంచి 40 ఆక్సిజన్‌ సిలిండర్లను వినియోగించే వాళ్లం. ఇప్పుడు 400 నుంచి 450 సిలిండర్లను ఉపయోగించాల్సి వస్తుంది. వీటిలో 100 సిలిండర్ల వరకు సొంత ప్లాంట్‌ నుంచి ఉత్పత్తి అయిన వాటినే వినియోగించుకుంటున్నాం. తద్వారా ప్రాణ నష్టాన్ని నివారించగలుతున్నాం ’ అని అరుణ్‌ గౌర్‌ పేర్కొన్నారు.
(చదవండి: రాజస్థాన్‌ సీఎంకు కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు