10న పార్లమెంటు కొత్త భవనానికి భూమి పూజ

6 Dec, 2020 03:48 IST|Sakshi

ప్రధాని మోదీ భూమి పూజ చేస్తారన్న స్పీకర్‌ బిర్లా

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనానికి ఈ నెల 10న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. రూ.971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఈ కొత్త భవనం నిర్మాణం 2022 నాటికి పూర్తి అయ్యే అవకాశాలున్నాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా శనివారం తెలిపారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య దేవాలయం వందేళ్లు పూర్తి చేసుకుందని, ఆత్మనిర్భర్‌లో భాగంగా మనమే కొత్త భవనాన్ని నిర్మించుకోవడం దేశానికి గర్వకారణమని బిర్లా అన్నారు.

కోవిడ్‌ నిబంధనల మ«ధ్య డిసెంబర్‌ 10 మధ్యాహ్నం ఒంటిగంటకి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించామని కొందరు స్వయంగా హాజరైతే, మరికొందరు ఆన్‌లైన్‌ ద్వారా తిలకిస్తారని బిర్లా చెప్పారు. 2022లో జరిగే దేశ 75వ స్వాతంత్య్ర దిన వేడుకల నాటికి కొత్త భవనంలోనే పార్లమెంటు సమావేశాలు జరుగుతాయని బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ భవనాన్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేస్తూ పేపర్‌లెస్‌ కార్యాలయాలను నిర్మించనున్నారు.

భవిష్యత్‌లో పార్లమెంటు నియోజకవర్గాలను పెంచే ఉద్దేశం ఉన్న కేంద్రం అందుకు అనుగుణంగా లోక్‌సభ కార్యక్రమాలు నిర్వహించే హాలుని 888 మంది సభ్యులు కూర్చోవడానికి వీలుగా, రాజ్యసభ సమావేశ మందిరాన్ని 384 సీట్ల సామర్థ్యంతో నిర్మించనున్నారు. లోక్‌సభలో 1,224 మంది (ఉభయ సభలు సమావేశమైనప్పుడు) కూర్చునేందుకు వీలుగా సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశముంటుంది. ఈ భవన నిర్మాణంలో 2 వేల మంది ప్రత్యక్షంగా 9 వేల మంది పరోక్షంగా పాల్గొననున్నారు. 64.500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే ఈ భవనం బయట నుంచి చూడడానికి ప్రస్తుతమున్న పార్లమెంటు మాదిరిగానే ఉంటుందని బిర్లా వివరించారు.

మరిన్ని వార్తలు