ఇది ఆటో కాదు భాయ్‌.. ప్రాణాలు నిలిపే అంబులెన్స్‌..

30 Apr, 2021 12:43 IST|Sakshi

రాంచీ: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే అనేక మంది ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. మొదటి దశ కంటే సెకండ్‌వేవ్‌ మరింత ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో​ భారత్‌లోని అనేక ఆసుపత్రుల్లో సరైన మందులు, వ్యాక్సిన్‌లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, పీపీఈ కిట్లు అందుబాటులో లేక కరోనా బాధితులు నరకం అనుభవిస్తున్నారు. ఇప్పటికే కొందరు మాయగాళ్లు ఈ మందులను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారు. ఇంకా కొన్ని చోట్ల కరోనా బాధితులను ఆసుపత్రికి చేర్చే అంబులెన్స్‌ వారు కూడా అధిక మొత్తంలో డబ్బులను డిమాండ్‌ చేస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా ఓ ఆటో ‍డ్రైవర్‌ మాత్రం కరోనా పేషెంట్ల కోసం తన వంతు సాయం చేయాలని సంకల్పించుకున్నాడు.

భోపాల్‌ నగరానికి చెందిన జావేద్‌ఖాన్‌ అనే ఆటో డ్రైవర్‌ కోవిడ్‌ బాధితుల కోసం ఏదైనా చేయలనుకున్నాడు. ఈ క్రమంలో కరోనా బాధితులు అంబులెన్స్‌ల కొరతతో బాధపడుతున్నారని తెలుసుకున్నాడు. వెంటనే తన ఆటో రిక్షానులో మొబైల్‌ అంబులెన్స్‌గా మార్చాడు. అంతటితో ఆగకుండా, దాంట్లో ప్రథమ చికిత్సకు అవసరసరమయ్యే కిట్‌, ఆక్సిజన్‌ సిలిండర్‌ , శానిటైజర్‌, మందులను ఏర్పాటు చేశాడు. ఈ ఆటో రిక్షాను కరోనా బాధితులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపాడు.

కాగా, జావేద్‌ 18 సంవత్సరాలుగా ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కోవిడ్‌ కల్లోలం వల్ల తన ఆటోను అంబులెన్స్‌గా మార్చిన భర్తను చూసి గర్వపడి ఊరుకోలేదు అతడి భార్య. తన బంగారు లాకెట్‌ను ఆటోలో సదుపాయాల కోసం అమ్మేసింది.  ఇదిలా వుంటే ఒక్క ఆక్సిజన్‌ సిలెండర్‌ కోసమే ప్రతిరోజు 600 రూపాయలు ఖర్చవుతుందని జావేద్‌ తెలిపాడు. అయినా సరే ఎవరికి ఏ అవసరమొచ్చినా తనను సంప్రదించాలని భోపాల్‌ ప్రజలను కోరాడు. ఇతని గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా, ఇప్పటికే రాంచీలో ఒక ఆటోడ్రైవర్‌ కరోనా రోగులకు ఉచితంగా ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు