Kashmir Files Director: కశ్మీర్‌ ఫైల్స్‌ డైరెక్టర్‌ ‘హోమోసెక్సువల్స్‌’ కామెంట్లు.. అది సొంత అనుభవమేమో అంటూ సెటైర్లు

25 Mar, 2022 16:45 IST|Sakshi
భార్య పల్లవితో వివేక్‌ అగ్నిహోత్రి (పాత చిత్రం)

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. కశ్మీర్‌ ఫైల్స్‌ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రిపై మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో భోపాలీలంటే స్వలింగ సంపర్కులంటూ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కామెంట్లు చేయడంపై దుమారం రేగింది. ఈ నేపథ్యంలోనే డిగ్గీ రాజా సీరియస్‌ అయ్యారు.  

వివేక్ అగ్నిహోత్రి గారు..  ఇది మీ  వ్యక్తిగత అనుభవం కావచ్చు. అంతేగానీ భోపాల్ ప్రజలది కాదు. నేను 77 ఏళ్ల నుంచి భోపాల్, అక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఉన్నా. కానీ నాకు ఏనాడూ అలాంటి అనుభవం ఎదురు కాలేదు.  ఎక్కడున్నా.. మీ పక్కన ఉండేవాళ్ల ప్రభావమే దానికి కారణమై ఉంటుందని గుర్తించండి అంటూ ట్వీట్‌తో దిగ్విజయ్‌ సింగ్‌, వివేక్‌ అగ్నిహోత్రికి చురకలు అంటించారు. 

ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో వివేక్‌ అగ్నిహోత్రి మాట్లాడుతూ.. ‘‘నేను భోపాల్‌లో పెరిగినా, అనుబంధం ఉన్నా.. భోపాలీ అని పిలుచుకోవడానికి ఇష్టపడను. ఎందుకంటే.. ఆ పదానికి ఒక నిర్దిష్ట అర్థం జనాల మైండ్‌లో ఫిక్స్‌ అయిపోయింది.  భోపాలీలు స్వలింగ సంపర్కులుగా భావించబడుతున్నారని, అందుకు బోఫాల్‌ నవాబీ నగరం కావడం, వాళ్ల కోరికలే కారణం అయి ఉండొచ్చు’ అని వివేక్‌ అగ్నిహోత్రి వెకిలి వ్యాఖ్యలు చేశాడు. 

ఇదిలా ఉండగా.. ఈ కామెంట్లపై మీడియా వివేక్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేసింది. శుక్రవారం ఉదయం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వివేక్‌ అగ్నిహోత్రిని మీడియా ప్రతినిధులు ‘హెమోసెక్సువల్స్‌’ కామెంట్లపై వివరణ అడగ్గా మౌనంగా వెళ్లిపోయారు. ఆయన వెంట ఉన్న బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్‌ విజయ వరిగ్యాను మీడియా అడ్డుకుని ‘నేను ఇండోర్‌వాసిని. అదేదో ఆయన్నే(వివేక్‌ అగ్నిహోత్రి) అడగొచ్చుగా’ అంటూ తప్పించుకున్నారు. 

మరోవైపు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి కేకే మిశ్రా ఈ వ్యవహారం ఆధారంగా బీజేపీపై సెటైర్లు సంధించారు. అగ్నిహోత్రి వ్యాఖ్యలపై నేనేం మాట్లాడను. కానీ, రాఘవ్‌ జీ భాయ్‌, ఆరెస్సెస్‌ ప్రచారక్‌ ప్రదీప్‌ జోషి వ్యవహారాలు(స్వలింగ సంపర్కులనే విషయం) వెలుగులోకి వచ్చాకే ఆయన(వివేక్‌ అగ్నిహోత్రి) స్పందించాడా? వాటి ఆధారంగానే భోపాల్‌ మొత్తాన్ని హోమోసెక్సువల్స్‌ అంటున్నాడా? ఇంతకీ అగ్నిహోత్రిపై వాళ్లు తీసుకోబోయే చర్యలేంటి? అంటూ మధ్యప్రదేశ్‌ హోంమంత్రిని ట్యాగ్‌ చేస్తూ మరీ ఓ సెటైరిక్‌ ట్వీట్‌ చేశాడు కేకే మిశ్రా. 

అంతేకాదు వివేక్‌పై చర్యలు తీసుకోలేని రాజకీయ నంపుసకత్వం అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మరో ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉండగా..  వివేక్‌ అగ్నిహోత్రి వ్యాఖ్యలపై భోపాల్‌కు చెందిన జర్నలిస్టులు, ఉద్యమకారులు సోషల్‌ మీడియాలో అసంతృప్త నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు