ఛత్తీస్‌గఢ్‌ అమరులకు ఘన నివాళులు

28 Apr, 2023 05:46 IST|Sakshi

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దంతెవాడలో బుధవారం మావోయిస్టుల మందుపాతర పేల్చిన ఘటనలో అమరులైన 10 మంది పోలీసు సిబ్బంది, ఒక డ్రైవర్‌కు ఘనంగా నివాళులర్పించారు. కర్లి ప్రాంతంలోని పోలీస్‌లైన్స్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబీకులు, బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం రోదనలు, భారత్‌ మాతా కీ జై నినాదాలతో ప్రతిధ్వనించింది.  ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ తదితరులు హాజరై మృతులకు పూలతో నివాళులర్పించారు.

బాధిత కుటుంబాలను బఘేల్‌ ఓదార్చారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను వాహనాల్లో సొంతూళ్లకు తరలించారు. సీఎం బఘేల్‌ కూడా భుజం కలిపి ఒక జవాను మృతదేహాన్ని వాహనం వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరుల త్యాగాలు వృథా కావని, మావోయిస్టులపై పోరు మరింత తీవ్రతరం చేస్తామని చెప్పారు. దంతెవాడ జిల్లా అరన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసుల వాహనాన్ని నక్సల్స్‌ మందుపాతరతో పేల్చిన ఘటనలో డిస్ట్రిక్ట్‌ రిజర్వు గార్డు(డీఆర్‌జీ) విభాగానికి చెందిన 10 మంది జవాన్లు, డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు.
శవపేటికను మోస్తున్న సీఎం బఘేల్‌

మరిన్ని వార్తలు