అనారోగ్యంతో హిందీ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మృతి

3 Feb, 2021 14:57 IST|Sakshi

ఢిల్లీ: తనకు తాను దేవుడిగా ప్రకటించుకుని రాజకీయ నాయకుడిగా చలామణి అయిన వ్యక్తి మృతి చెందాడు. ఆయన బిగ్‌బాస్‌ 10వ సీజన్‌లో పోటీదారుడిగా పాల్గొన్నాడు. మూడు నెలల కిందట కరోనా బారిన పడడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. 15 రోజులుగా ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయనే హిందీ బిగ్‌బాస్‌ షోలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి స్వామి ఓం.

కరోనా బారిన పడినప్పటి నుంచి స్వామి ఓం ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. దీంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతడి కుమారుడు అర్జున్‌ జైన్‌, స్నేహితుడు ముఖేశ్‌ జైన్‌ తెలిపారు. ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌లో అతడి అంత్యక్రియలు నిర్వహించారు. స్వామి ఓం 2017లో జరిగిన బిగ్‌బాస్‌ 10 షోలో అత్యంత వివాదాస్పదమయ్యాడు. హౌస్‌లో ఉన్నప్పుడు తోటి కంటెస్టెంట్లపై మూత్ర విసర్జన చేయడం వైరలైగా మారింది. అతడి చర్యలు తీవ్రంగా ఉండడం. తోటి పోటీదారులు ఇబ్బందులు పడడంతో హోస్ట్‌గా ఉన్న సల్మాన్‌ఖాన్‌ అతడిని బహిష్కరించిన విషయం తెలిసిందే.

అయితే హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అనంతరం స్వామి ఓం వైఖరిలో ఏం మార్పు రాలేదు. పైగా బిగ్‌బాస్‌ యాజమాన్యం, హోస్ట్‌గా వ్యవహరించిన సల్మాన్‌ ఖాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్వామి ఓం 2008లో ఓ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే ఆయన తనకు తాను దేవుడిగా అభివర్ణించుకుని హల్‌చల్‌ చేశాడు.

మరిన్ని వార్తలు