అగ్నిపథ్‌ ఎఫెక్ట్‌: బీహార్‌ బంద్‌.. చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

18 Jun, 2022 08:17 IST|Sakshi

అగ్నిపథ్‌ పథకంపై నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు శనివారం(జూన్‌ 18) బీహార్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) నేతృత్వంలోని సంస్థలు ఈ పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరాయి. ఇక, విద్యార్థుల సంఘాల పిలుపు మేరకు బంద్‌కు ప్రతిపక్ష ఆర్జేపీ తన మద్దతు ప్రకటించింది. 

 కాగా, అగ్నిపథ్‌ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ పార్టీ కార్యకర్తలతో కలిసి శనివారం గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసి మెమోరాండం సమర్పిస్తామని లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పాశ్వాన్‌..‘అగ్నిపథ్ పథకం వల్ల దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని.. యువతలో అసంతృప్తిని రగిల్చుతుందని’ అన్నారు. ఇదే విధమైన ఆందోళనలను లేవనెత్తుతూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు పాశ్వాన్ లేఖ రాసినట్టు తెలిపారు. 

ఇక, బంద్‌ ఎఫెక్ట్‌ ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. రైలు, బస్సు సేవలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. మరోవైపు.. బీహార్‌లో బంద్‌కు ప్రతిపక్ష పార్టీ మద్దతు ఇవ్వడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్న వారిలో రాజకీయ శక్తులు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. 

మరోవైపు.. బీహార్‌లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆర్జేడీనే కారణమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. ప్రజా ఆస్తులను తగలబెట్టే ఆర్జేడీ ఆగ్రహ నిరసనలలో బీహారీలు చనిపోతున్నారు. దీనికి ఆర్జేడీనే సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్‌ చేశారు. ఇక శనివారం తలపెట్టిన బీహార్‌ బంద్‌ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. 

ఇది కూడా చదవండి: అగ్నిపథ్‌పై ఆర్మీ రిటైర్డ్‌ జనరల్స్‌ సూచనలు ఇవే..

మరిన్ని వార్తలు