బిహార్‌ కులకలం

9 Jan, 2023 04:50 IST|Sakshi

రాజకీయ తేనెతుట్టెను కదిపిన నితీశ్‌ 

బిహార్‌ కులగణన ప్రభావం

లోక్‌సభ ఎన్నికలపై పడుతుందా? 

కులాల లెక్కింపుతోప్రయోజనాలేంటి?

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఏ ఇతర పార్టీ చేయని సాహసానికి పూనుకున్నారు. రాష్ట్రంలో కులగణనకి శ్రీకారం చుట్టారు. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాలు లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు. రెండు దశలుగా సాగే ఈ ప్రక్రియ కోసం ప్రత్యేకంగా ఒక మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించారు.

దేశ ప్రయోజనాల కోసమే కులగణనను చేపడుతున్నామని, ఓబీసీల అసలు లెక్కలు ఎంతో తేల్చాలన్నదే తమ ఉద్దేశమని నితీశ్‌ కుమార్‌ బయటకి చెబుతున్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఈ సంక్లిష్ట ప్రక్రియను మొదలు పెట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. కులగణనపై వివిధ వర్గాల్లో  భిన్నాభిప్రాయాలున్నాయి. దేశంలో సామాజిక న్యాయం జరగాలంటే, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలంటే కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాల్సిందేనని ఒక వర్గం గట్టిగా పట్టుబడుతోంది.

ఓబీసీలకు కేటాయించిన కోటా వారికి సమానంగా పంపిణీ చేయడం కోసం నియమించిన రోహిణి కమిషన్‌ ఓబీసీల్లో 2,633 కులాలు ఉన్నాయని తేల్చింది. అయితే ప్రస్తుతం మన దేశంలో అమలవుతున్న ఓబీసీల రిజర్వేషన్లలో ఎక్స్‌ట్రీమ్లీ బ్యాక్‌వార్డ్‌ కేస్ట్స్‌ (ఈబీసీ)లకే అమలవుతున్నాయి. మరోవైపు 21 శతాబ్దంలో కూడా కులాల వారీగా జనాభా లెక్కిస్తే సమాజంలో మరిన్ని చీలికలు వస్తాయని మరో వర్గం వాదనగా ఉంది. ఇంకా కులాల కుంపట్లలోనే మగ్గిపోతూ ఉంటే గ్లోబల్‌ సూపర్‌ పవర్‌గా భారత్‌ ఎదిగే అవకాశాలకు గండిపడుతుందనే అభిప్రాయాలున్నాయి.  

ఎందుకీ కులగణన?  
స్వాతంత్య్రానంతరం ఇప్పటివరకు కులాలవారీగా జనాభా లెక్కింపు చేపట్టలేదు. 1990లో కేంద్రంలో జనతాదళ్‌ ఆధ్వర్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. జనాభా ప్రాతిపదిక అంటూ ఏమీ లేకుండా 27% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం 1992 నుంచి అమలవుతోంది. ఇప్పటివరకు మన దగ్గరున్న కులాల లెక్కలకు 1931 నాటి గణాంకాలే  ఆధారం. వాటి ప్రకారం జనాభాలో ఓబీసీలు 52 శాతం!

పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల జనాభాను లెక్కిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన వారికి రిజర్వేషన్లున్నాయి. అందుకే తమకూ అలాగే రిజర్వేషన్లను పెంచాలని ఓబీసీలు డిమాండ్‌ చేస్తున్నారు. కుల సమీకరణలు అధికంగా ఉన్న బిహార్‌లో ఓబీసీలే కీలకం. ఓబీసీ నాయకుడైన  నితీశ్‌ మొదట్నుంచి కులగణనకు మద్దతుగా ఉన్నారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక దాన్ని ఆచరణలో పెట్టి రాజకీయ వేడిని పెంచారు.   

ఒక్కసారి చరిత్రలోకి చూస్తే..  
భారత దేశంలో మొట్టమొదటి సారిగా బ్రిటిష్‌ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. మన దేశంలో ఉన్న విభిన్న వర్గాల ప్రజల్ని అర్థం చేసుకోవడానికే ఈ ప్రక్రియ మొదలు పెట్టింది. అప్పట్లో సేకరించిన సమాచారం ఆధారంగా కులాలకు ప్రాధాన్యతా క్రమాలను నిర్దేశించింది. అలా మొదలు పెట్టిన కులగణన 1931లో చివరిసారిగా చేశారు. ఆ నాటి జనాభా గణాంకాల ప్రాతిపదికగానే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. స్వాంతంత్య్రానంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కులగణనకు దూరంగా ఉన్నాయి.

పదేళ్లకి ఒకసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు.  2011లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థికంగా వెనుకబడిన కులాల వివరాలను కూడా సేకరించింది. కానీ వాటిని విడుదల చేయలేదు. ప్రస్తుతం కేంద్రంలో సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమ భూమిక యూపీఏ హయాంలో జరిగిన కులగణన సరిగా జరగలేదని, అదంతా తప్పులతడకగా సాగిందని చెబుతున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితులకు ఆ డేటా పాతబడిపోయిందని వివరించారు.  
 
లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం ఎంత ?  
బిహార్‌లో కులగణన పూర్తయి లోక్‌సభ ఎన్నికల కంటే ముందే నివేదిక వస్తే నితీశ్‌ కుమార్, తేజస్వి యాదవ్‌లకే అత్యధికంగా లాభం చేకూరే అవకాశాలే కనిపిస్తున్నాయి. బిహార్‌లో ఓబీసీల్లో మరింతగా వెనుకబడిన వారైన అత్యంత వెనకబడిన తరగతులు(ఈబీసీ), దళితుల్లో మరింత అణగారిన మహాదళితుల కార్డుతో కొత్త సామాజిక సమీకరణలకి తెరతీసిన నితీశ్‌ రాజకీయంగా లబ్ధి పొందుతూ వస్తున్నారు. వీరి వాస్తవ సంఖ్య వెల్లడైతే ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఆయన పై చేయి సాధించవచ్చు. మహారాష్ట్ర, ఒడిశా వంటి రాష్ట్రాలు, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే వంటి పార్టీలు కులగణనకు మద్దతుగా ఉండడంతో దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలన్న స్వరం పెరుగుతుంది. 

ఇప్పుడు బిహార్‌లో ఓబీసీ జనాభా ఎంత ఉందో వాస్తవాలు వెల్లడైతే వారి ఓటు బ్యాంకే ప్రధానంగా కలిగిన ప్రాంతీయ పార్టీలు బలపడతాయి. ఇది జాతీయ స్థాయిలో ప్రధాన పార్టీలైన బీజేపీకి, కాంగ్రెస్‌కు కూడా ఎదురు దెబ్బగా పరిణమిస్తుంది. అంతే కాకుండా దేశంలో మరోసారి మండల్‌ వర్సెస్‌ కమండల్‌ రాజకీయాలకు తెరలేవచ్చు. 1990 దశకంలో బీజేపీ నేత అద్వానీ రథయాత్రకు కౌంటర్‌గా మండల్‌ కమిషన్‌ నివేదికతో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడం దేశవ్యాప్తంగా హింసకు దారి తీసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను మినహాయించి మిగిలిన కులాల జనగణన సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇప్పుడు నితీశ్‌ కుమార్‌ చేపట్టిన ప్రక్రియ జాతీయ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.

– సాక్షి, నేషనల్‌డెస్క్‌

మరిన్ని వార్తలు