బిహార్‌ ప్రభుత్వ బల నిరూపణ ఆలస్యం.. బీజేపీ స్పీకర్‌ కారణమా?

11 Aug, 2022 16:48 IST|Sakshi

పాట్నా: బిహార్‌లో బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఆర్‌జేడీతో కలిసి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నితీశ్‌ కుమార్‌. ఆయన సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వత తొలిసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్‌లోనే జేడీయూ-ఆర్‌జేడీ ప్లస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం స్పీకర్‌ పదవీలో బీజేపీ నేత ఉండటంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా స్పీకర్‌ను మార్చాలని అధికార కూటమి భావిస్తోంది. అవసరమైన బలం ఉన్నప్పటికీ అనవసర రిస్క్‌ తీసుకోకూడదని నేతలు భావిస్తున్నారు. 

సాంకేతికంగా గవర్నర్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆదేశించాలి. కానీ, ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు నడుచుకుంటారు. ఇప్పటికే.. స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హాపై అవిశ్వాస తీర్మానాన్ని 55 మంది మహాకూటమి ఎమ్మెల్యేలు ఇచ్చారు. అయితే.. నిబంధనల ప్రకారం ఈ తీర్మానం ఇచ్చిన రెండు వారాల తర్వాతే అసెంబ్లీ ముందుకు వస్తుంది. అందుకే ఆగస్టు 24 వరకు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. 

మహాగడ్బంధన్‌ కూటమికి ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 243 సభ్యుల అసెంబ్లీలో 122 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే, ఎలాంటి రిస్క్‌ తీసుకోకూడదనే ధోరణి కనిపిస్తోంది. ఆగస్టు 25న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు నితీశ్‌. ఆగస్టు 24న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున అవిశ్వాస తీర్మానంతో స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హాను తొలగించి కొత్తవారిని ఎన్నుకోనున్నారు. మరోవైపు.. ఆలోపే స్పీకర్‌ సిన్హా రాజీనామా చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. అయితే, ఆయన బీజేపీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త స్పీకర్‌ ఆర్‌జేడీ నుంచి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: ఉచితాలు, సంక్షేమ పథకాలు రెండు వేరు వేరు: సుప్రీం కోర్టు

మరిన్ని వార్తలు