బుద్ధగయాకు దలైలామా.. గూఢచర్యం ఆరోపణలతో ‘చైనా మహిళ’ అరెస్ట్‌!

29 Dec, 2022 20:08 IST|Sakshi

పట్నా: బౌద్ధమత గురువు దలైలామా బిహార్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం బుద్ధగయాలో పర్యటిస్తున్నారు. మూడురోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దలైలామా పర్యటన వేళ భద్రతాపరమైన అలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతోందన్న అనుమానాలతో చైనాకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను తిరిగి చైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

దలైలామా పర‍్యటన వేళ చైనా మహిళ అనుమానాస్పద కదలికలపై గురువారం స్థానిక పోలీసులను అలర్ట్‌ చేశారు అధికారులు. ఆమె ఆనవాళ్లను సూచించే ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పేరు సాంగ్‌ షియావోలాన్‌ అని పోలీసులు తెలిపారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు హాని తలపెట్టేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. 

‘గయాలో నివసిస్తున్న చైనా మహిళ గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఆమె గత రెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులను అప్రమత్తం చేశాం. చైనా మహిళ కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చైనా మహిళ ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదు. ఆమె చైనా గూఢచారి అనడాన్ని కొట్టిపారేయలేం.’ అని తెలిపారు గయా సీనియర్‌ ఎస్పీ హర్‌ప్రీత్‌ కౌర్‌. ఆమె ఊహాచిత్రాలు బుధవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనా మహిళ గురించి తెలిసిన వారు సమాచారం అందివ్వాలని పోలీసులు కోరుతున్నారు. చైనా గూఢచారి అయిన ఆ మహిళ బుద్ధగయాతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాదికిపైగా నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ వద్ద ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. 

బుద్ధగయాకు గత వారు చేరుకున్నారు దలైలామా. కోవిడ్‌-19 కారణంగా బుద్ధ పర్యటక ప్రాంతమైన బుద్ధగయాను రెండేళ్ల తర్వాత సందర్శించారు. గయా అంతర్జాతీయ విమానాశ్రయానికి డిసెంబర్‌ 22న చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్‌ త్యాగరాజన్‌, ఎస్పీ హర్‌ప్రీత్‌ కౌర్‌ ఘన స్వాగతం పలికారు. డిసెంబర్‌ 29-31 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బిహార్‌కు చేరుకున్నారు.

ఇదీ చదవండి: బెంగాల్‌ కేబినెట్‌ మంత్రి ఆకస్మిక మృతి.. మమతా బెనర్జీ దిగ్భ్రాంతి

మరిన్ని వార్తలు