Bihar Covid Deaths: ప్రభుత్వ లెక్కల్లో తప్పిదాలు

10 Jun, 2021 10:10 IST|Sakshi

పాట్నా: ప్రతిపక్షాల డిమాండ్​తో,  కోర్టు మొట్టికాయలతో దిగొచ్చిన నితీష్ కుమార్​​ ప్రభుత్వం ఎట్టకేలకు కరోనా లెక్కల్ని సవరించి అధికారికంగా ప్రకటించింది. బీహార్​లో కొవిడ్​-19తో ఇప్పటిదాకా  9 వేలమందికి పైగా చనిపోయారని తేల్చింది. ఇది గతంలో ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల కంటే ఎక్కువగా ఉండడం విశేషం. కాగా, ఇంతకు ముందు బీహార్​ ఆరోగ్య శాఖ మరణాల లెక్కను 5, 500గా చూపించింది. ఈ తరుణంలో  కోర్టు జోక్యంతో తాజా సంఖ్యను 9,429గా తేల్చింది. 

ఇక మార్చ్​ 2020 నుంచి మార్చ్​ 2021 మధ్య కొవిడ్ మరణాలు 1,600 కాగా, కేవలం ఏప్రిల్ నుంచి జూన్ 7వ తేదీ మధ్య 7,775 మరణాలు సంభివించాయని బీహార్​ ఆరోగ్య శాఖ కోర్టుకు నివేదిక సమర్పించింది. అంటే ఈ రెండు నెలల్లోనే అంతకు ముందుకంటే ఆరు రెట్ల మరణాలు నమోదు అయ్యాయన్నమాట.  మొత్తం జిల్లాలను పరిశీలించాక 72 శాతం పెరగుదలతో ఆరోగ్య శాఖ సమర్పించిన నివేదికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

38 జిల్లాలకుగానూ రాజధాని పాట్నాలో 2,303 మంది చనిపోగా, రివైజ్​ లెక్కల్లో ఇక్కడే ఎక్కువ మరణాలు నమోదు అయినట్లు చూపించారు. సీఎం నితీశ్​ స్వంత జిల్లా నలందలో 222 మరణాలు నమోదు అయ్యాయి. ఒక ప్రాంతం వాళ్లు మరో ప్రాంతంలో కరోనా ట్రీట్​మెంట్​తో చనిపోవడం వల్లే ఈ గందరగోళం నెలకొందని ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి ప్రత్యాయ్​ అమ్రిత్​ వెల్లడించాడు. కరోనా మరణాల సంగతి ఎలా ఉన్నా.. తాజా లెక్కలతో మిగతా వాటిల్లో కూడా భారీ మార్పులు చూపించింది ప్రభుత్వం. ఇక రికవరీ రేటును కూడా 98 నుంచి 97 శాతానికి తగ్గించడం విశేషం. ఇదిలా ఉంటే అధికారిక లెక్కల్లో కొవిడ్​ అంత్యక్రియల సంఖ్య 3,243గా ఉండడం కొసమెరుపు.  అయితే బీహార్​ మాత్రమే కాదని.. దేశం మొత్తం ఇలాంటి లెక్కల గందరగోళం అంతటా ఉందని పలువురు ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

చదవండి: ప్రజల సొమ్మే కదా.. నొక్కేద్దాం!

మరిన్ని వార్తలు