రాజకీయాల్లో చేరతారు.. స్పందించిన పాండే

23 Sep, 2020 11:16 IST|Sakshi

పట్నా: బిహార్‌ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్‌ డేస్‌ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’)

ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్‌ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్‌ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్‌ కుమార్‌ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు