ఇక్కడ వైద్యం అంటే నరకంలో బెర్త్‌ కన్‌ఫామ్‌

22 May, 2021 15:11 IST|Sakshi
బిహార్‌ డీఎంసీహఎచ్‌ ప్రాంగణంలో నిలిచి పోయిన మురికి నీరు

అధ్వానంగా మారిన బిహార్‌ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌

పట్న: కోవిడ్‌ విజృంభిస్తోన్న వేళ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ఇక ఆస్పత్రుల సంగతైతే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కరోనా వార్డులను చాలా పరిశుభ్రంగా ఉంచాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రలను కూడా విధిగా ప్రతి రోజు శుభ్రం చేస్తున్నారు. అయితే బిహార్‌లోని ఓ ఆస్పత్రిని చూస్తే.. ఎవరికి దాన్ని హాస్సిటల్‌ అని పిలవాలనిపించదు. ఎక్కడికక్కడ పెరుకుపోయిన చెత్త.. రోడ్లపై నిలిచిపోయిన మురికి నీరు.. మనుషులతో పాటు ఆస్పత్రి ప్రాంగణంలో పందులు, పశువులు కూడా అక్కడే తిరుగుతున్నాయి. రోగులకు వైద్య సేవలతో పాటు ఈ జంతువులను తరమడం అక్కడ సిబ్బంది విధుల్లో భాగం అయ్యింది.

బిహార్‌లోని పురాతన వైద్య కళాశాలలలో ఒకటైన దర్భంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో(డీఎంసీహెచ్‌) ఇలాంటి దృశ్యాలు నిత్యకృత్యం అయ్యాయి. సమస్తిపూర్, మధుబని, సహర్సాతో సహా అనేక జిల్లాల ప్రజలు ఈ డీఎంసీహెచ్‌పై ఆధారపడతారు. కాని ఇక్కడ వైద్యం చేయించుకోవడం అంటే.. నరకంలో ప్రవేశించడమే అంటున్నారు స్థానికులు.

అత్యవసర విధులు నిర్వహించే నర్సులు, డాక్టర్లు మురికి నీటి కాలువలను దాటుకుంటూ అక్కడకు చేరుకోవాలి. ఈ క్రమంలో దీపా కుమారి అనే నర్సు మాట్లాడుతూ.. ‘‘గత 27 సంవత్సరాలుగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. వర్షాకాలంలో ఇది మరింత తీవ్రమవుతుంది’’ అని తెలిపారు. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో ఫ్రంట్‌లైన్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేయవలసి వస్తుంది.

డీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ మణి భూషణ్ శర్మ కార్యాలయం కూడా  ఈ చెత్త మధ్యనే ఉంది. ఆయన తన ఆఫీస్‌కు చేరుకోవాలంటే ఓ గార్డు, డ్రైవర్ సహాయం తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఆస్పత్రి చాలా పాతది, లోతట్టు ప్రాంతంలో ఉంది. ఇదే ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవనంలో కోవిడ్‌ బాధితులకు  చికిత్స చేస్తున్నాం. కానీ అక్కడకు చేరుకునే పరిసరాలు కూడా ఇలానే నీరు నిండిపోయి ఉంటాయి.  సిబ్బంది చాలా తక్కువగా ఉండటం కూడా సమస్యే’’ అన్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజనులు మండిపడుతున్నారు. పన్నుల రూపంలో మా దగ్గర నుంచి లక్షల్లో దోచేస్తూ.. కనీస సౌకర్యాలు కల్పించని ఈ ప్రభుత్వాలు ఎందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: మానవత్వం మచ్చుకైనా లేదు.. అంత ‘మనీ’తత్వమే


 

మరిన్ని వార్తలు