వీడియో: శానిటరీ పాడ్స్‌పై ప్రశ్న.. ఐఏఎస్‌ అధికారిణి వివరణతో షాక్‌ తిన్న విద్యార్థినులు

28 Sep, 2022 20:23 IST|Sakshi

వైరల్‌: ఆమె ఒక ఐఏఎస్‌ అధికారిణి.  అదీ మహిళాశిశు సంక్షేమ శాఖకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది. స్కూల్‌ స్టూడెంట్స్‌ అందునా అమ్మాయిలు చేసిన విజ్ఞప్తికి ఆమె స్పందించిన తీరుపై మండిపడుతున్నారంతా. ఊరకుంటే.. కండోమ్‌లు కూడా ఫ్రీగా పంచాలని అడుగుతారంటూ విద్యార్థులను ఉద్దేశించి వెటకారంగా ఆమె చేసిన వ్యాఖ్యలు కంపరం పుట్టిస్తున్నాయి.

బీహార్‌ వుమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హర్‌జోత్‌ కౌర్‌ భామ్రా ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్‌ ఉచితంగా ఇవ్వలేదా? అని ఓ అమ్మాయి ప్రశ్నించింది. దీనికి ఆ ఐఏఎస్‌ అధికారిని ఇచ్చిన వివరణలు, ఆ అమ్మాయితో పెట్టుకున్న వాగ్వాదం.. ఆమెను చిక్కుల్లో పడేసింది.

సాశక్త్‌ భేటీ.. సమృద్ధి బీహార్‌ పేరుతో యునిసెఫ్‌ మరికొన్ని సంస్థల భాగస్వామ్యంతో మంగళవారం సాయంత్రం పాట్నాలో ఒక కార్యక్రమం నిర్వహించింది. దీనికి డబ్ల్యూసీడీసీ ఎండీ హర్‌జోత్‌ కౌర్‌ హాజరయ్యారు. అయితే.. కార్యక్రమానికి హాజరైన ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నతో మొదలైన వ్యవహారం.. వాడీవేడిగా సాగింది. 

ఉచిత ప్రకటనలు చేసే ప్రభుత్వం.. రూ.20-30 ఖర్చు చేసి ఉచితంగా శానిటరీ పాడ్‌లు అందించలేదా? అని స్టూడెంట్‌ ప్రశ్నించింది. దానికి హర్‌జోత్‌ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్‌ ప్యాంట్స్‌ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్‌ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్‌ పద్దతుల్లో ఒకటైన కండోమ్‌లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు. 

ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్‌జోత్‌ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్‌ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్‌జోత్‌. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు. 

ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్‌ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్‌జోత్‌ కౌర్‌ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్‌ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. ప్రస్తుతం ఆ ఐఏఎస్‌ అధికారిణి-విద్యార్థినులకు మధ్య జరిగిన చర్చ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు