ఖాకీ వెబ్‌ సిరీస్‌తో ఫేమస్‌.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌

8 Dec, 2022 17:39 IST|Sakshi

బిహార్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోధా జీవితం ఆధారంగా ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌లో వెబ్‌ సిరీస్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది కూడా. వాస్తవానికి ఐపీఎస్‌ అధికారి అమిత్‌ ఒక గ్యాంగ్‌స్టర్‌ అశోక్‌ మెమతోను పట్టుకోవడానికి చేపట్టిన ఆపరేషన్‌ ఆధారంగా తెరకెక్కించిందే ఈ వెబ్‌ సీరిస్‌. ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది కూడా.

కానీ ఇప్పుడూ ఆ వెబ్‌ సిరీస్‌ కారణంగానే ఐపీఎస్‌ అధికారి అవినీతి అరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆర్థిక స్వలాభం కోసం తన పదవిని ఉపయోగించుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు ఆర్థిక నేరాల విభాగం కేసు నమోదు చేసింది. ఐపీఎస్‌ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ఫ్రైడే స్టోరీ టెల్లర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు అమిత్‌. ఐతే ప్రొడక్షన్‌ హౌస్‌తో అతని డీల్‌ విలువ రూ.1 కానీ అతని భార్య అకౌంట్‌లోకి సుమారు రూ.48 లక్షల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అసలు ఈ ఒప్పందం కుదరక మునుపే భార్య ఖాతాలో కొంత సొమ్ము జమ అయినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో సదరు ఐపీఎస్‌ అధికారి అమిత్‌పై మనీలాండరింగ్‌ కింద పలు కేసులు నమోదు చేశారు. వాస్తవానికి ఆయన తీసిన నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌ సిరీస్‌ ఖాకీ  ఐపీఎస్‌ అధికారి తన కెరియర్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి రాసిన పుస్తకం బిహార్‌ డైరీస్‌: 'ది ట్రూ స్టోరీ ఆఫ్‌ హౌ బిహార్స్‌ మోస్ట్‌' ఆధారంగా రూపొందించింది.

ఇదిలా ఉండగా, సదరు అధికారి అమిత్‌ గయాలో ఐపీఎస్‌గా నియమితులైనప్పటి నుంచే అక్రమంగా సంపాదిస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అతను రచయిత కాదని పుస్తకాలు రాసి వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే అధికారం అమిత్‌కు లేదని ఆర్థిక నేరాల విభాగం పేర్కొంది. 

(చదవండి: పాముని కాపాడేందుకు బ్రేక్‌ వేయడంతో.. ఏకంగా ఐదు వాహనాలు)

మరిన్ని వార్తలు