పెళ్లి కొడుకుల మార్కెట్: నచ్చినవారిని కొనుక్కోవటమే..పరిమిత కాల ఆఫర్‌!

9 Aug, 2022 18:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్నా: పెళ్లైన కొత్తలో మూవీలో హైటెక్‌ మ్యారేజ్‌ బ్యూరో పేరుతో సునీల్‌ పెళ్లికొడుకులను విక్రయానికి పెడతాడు. మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసినట్లు పెళ్లి కొడుకులను కొనుగోలు చేయటం వింటే వింతగా ఉంది కదా?. అయితే.. అలాంటి మార్కెట్‌ ఒకటి నిజ జీవితంలో ఉందని మీకు తెలుసా? బిహార్‌లోని మధుబని జిల్లాలో ప్రతిఏటా పెళ్లికొడుకుల మార్కెట్‌ నిర్వహిస్తారు. స్థానిక మార్కెట్‌ ప్రాంతంలోని చెట్ల కిందే ప్రతిఏటా 9 రోజుల పాటు ఈ పెళ్లి కొడుకుల విక్రయాలు నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం సుమారు 700 ఏళ్ల నుంచి వస్తున్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. 

స్థానికులు ఈ పద్ధతిని సౌరత్‌ సభా అని పిలుస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మైతిల్ బ్రాహ్మిన్ సమాజానికి చెందిన వారు తమ కుమార్తెలను తీసుకుని ఈ మార్కెట్‌కు వస్తారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ మార్కెట్లో వేల మంది పెళ్లి కొడుకులు వారి కుటుంబ సభ్యులతో వస్తారు. సంప్రదాయ ధోతి, కుర్తా లేదా షీన్స్‌, టీషర్ట్‌ ధరిస్తారు. వారి ఆస్తులు, విద్యా అర్హతలను బట్టి వారికి రేటు నిర్ణయిస్తారు. 

పెళ్లి కొడుకును కొనుగోలు చేసే ముందు అతడి అర్హతలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తారు ఆడపిల్లల కుటుంబ సభ్యులు. అలాగే జన్మదినం, పాఠశాల ధ్రువపత్రాల వంటివి అడుగుతారు. వరుడిని వధువు ఎంపిక చేసుకున్న తర్వాత ఇరువురి కుటుంబాలు మిగతా కార్యక్రమాలు చేపడతాయి. వివాహాన్ని ఆడపిల్ల కుటుంబమే నిర్వహిస్తుంది. కర్నాత్‌ వంశపాలన కాలం నుంచి ఈ సంప్రదాయం వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విభిన్న గోత్రాల ప్రజల మధ్య పెళ్లిళ్లు చేసేందుకు రాజా హరిసింగ్‌ దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు. మరోవైపు.. వివాహాలు కట్నం లేకుండా చేయటమే దీని లక్ష్యంగా మరికొందరు తెలిపారు.

ఇదీ చదవండి: కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు

మరిన్ని వార్తలు