వైరల్‌: భర్త త్యాగం.. ప్రేమించిన వాడితో భార్య వివాహం

29 Apr, 2021 15:06 IST|Sakshi

బిహార్‌ వ్యక్తి  ఔదార్యం

పట్నా: తెలుగులో శ్రీకాంత్‌, ఉపేంద్ర, రచన హీరో, హీరోయిన్లుగా వచ్చిన సినిమా కన్యాదానం గుర్తుందా. ఈ సినిమాలో రచన, ఉపేంద్ర ప్రేమించుకుంటారు. కానీ పెద్దలు అంగీకరించకపోవడంతో రచన, శ్రీకాంత్‌ల వివాహం జరుగుతుంది. తర్వాత తన భార్య.. పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించిందని తెలుసుకున్న శ్రీకాంత్‌ వారిద్దరికి వివాహం చేస్తాడు. దాదాపు 22 ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచింది. ఇలాంటి సంఘటనలు వాస్తవంగా జరగవు కనుక ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ టాపిక్‌ ఎందుకంటే.. ఈ సినిమా కథ వాస్తవ రూపం దాల్చింది. 

పెళ్లైన ఏడేళ్ల తర్వాత భార్యను ఆమె ప్రేమించిన వాడికి ఇచ్చి వివాహాం చేసి.. ఆశీర్వదించాడు ఓ భర్త. ప్రస్తుతం ఈ స్టోరీ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. బిహార్‌ సుల్తాన్‌గంజ్‌కు చెందిన ఉత్తమ్‌ మండల్‌కి ఖగారియా జిల్లాకు చెందిన సప్న కుమారితో 2014లో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఉత్తమ్‌ బంధువు రాజు కుమార్‌తో సప్నకు పరిచయం ఏర్పడే ముందు వరకు కూడా వారి వివాహ జీవితం సంతోషంగా, సాఫీగా సాగింది. వయసులో తన కంటే చిన్నవాడైన రాజుతో సప్న ప్రేమలో పడింది. రాజు, ఉత్తమ్‌ ఇద్దరు ఒకే ప్రాంతంలో నివసిస్తుండేవారు. ఈ క్రమంలో సప్న, రాజుల బంధం గురించి ఉత్తమ్‌కు తెలిసింది. 

తన భార్య రాజుని ప్రేమిస్తుందని తెలుసుకున్న ఉత్తమ్ షాక్‌య్యాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇద్దరిని చితకబాదాలని అనుకున్నాడు. కానీ తనను తాను కంట్రోల్‌ చేసుకుని సప్నకు నచ్చ చెప్పాడు. ఇలా చేయడం మంచిది కాదని ఆమెను వారించాడు. కానీ సప్న ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో విషయం ఆమె తల్లిదండ్రులకు, అత్తమామలకు కూడా తెలిసింది. వారు కూడా ఆమెకు అనేక విధాలుగా నచ్చ చెప్పారు.. బెదిరించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సంవత్సరాలు గడుస్తున్న కొద్ది వారి బంధం మరింత బలపడసాగింది. ఈ లోపు ఉత్తమ్‌-సప్నలకు ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. కానీ ఆమె మనసులో రాజుపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. 

ఇక కాలం గడుస్తున్న కొద్ది ఉత్తమ్‌, సప్నల మధ్య విబేధాలు పెరిగాయి. తరచు గొడవపడేవారు. విసిగిపోయిన ఉత్తమ్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను ఆమె ప్రేమించిన వాడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఉత్తమ్‌ తమ ఇంటికి సమీపంలోని ఓ ఆలయంలో వారి పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. ఇక తన సమక్షంలోనే భార్యను ఆమె ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పెళ్లికి సప్న కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక పెళ్లి సమయంలో ఉత్తమ్‌ కన్నీటిపర్యంతమయ్యాడని.. కానీ తన భార్య ప్రేమించిన వాడితో నిండు నూరేళ్లు సంతోషంగా జీవిచాలని ఆశీర్వదించాడని స్థానికులు తెలిపారు. 

చదవండి: 71వ ఏట రెండో పెళ్లి.. కూతురు కామెంట్స్‌ వైరల్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు