కట్టెలు, మట్టి పొయ్యితో అసెంబ్లీకి

19 Feb, 2021 17:45 IST|Sakshi

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపుపై ఆగ్రహం

కాంగ్రెస్‌, ఆర్జేడీ ఎమ్మెల్యేలు శకీల్‌, ముఖేశ్‌ నిరసన

పాట్నా: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండడంతోపాటు వాటికి సమానంగా గ్యాస్‌ ధరలు ఆకాశన్నంటుడుతుండడంతో సామాన్యులతో పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఊరట లభించకపోవడంతో ప్రజలతో పాటు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు వినూత్నంగా హాజరయ్యారు. గ్యాస్‌ ధరల పెంపుతో ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కే అంటూ నిరసన వ్యక్తం చేశారు.

బిహార్‌లో బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ తన వాహనం నుంచి దిగుతూ కట్టెలు, మట్టి పొయ్యిని చేతిలో పట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ధరలు ఎలా పెరుగుతున్నాయో చెప్పేలా ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్యాస్‌ ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ప్రజలు మళ్లీ పాత పద్ధతిలో వంటలు వండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే షకీల్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే ప్రజలకు ఈ దుస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అసెంబ్లీ లోపలకు వెళ్లే సమయంలో భద్రతా సిబ్బంది పొయ్యి, కట్టెలను నిరాకరించారు.

ఇక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేశ్‌ రౌశన్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కారులో కాకుండా అసెంబ్లీకి సైకిల్‌పై వచ్చి పెట్రోల్‌ ధరల పెంపుపై ఆందోళన చేశారు. ‘7 గంటలకు సైకిల్‌పై బయల్దేరాను. అసెంబ్లీకి రావడానికి చాలా ఖర్చవుతోంది. దీనిపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది’ ఎమ్మెల్యే ముఖేశ్‌ మీడియాతో చెప్పారు.

మరిన్ని వార్తలు