Bihar: చదువు కోసం మేకలు అమ్మి ఫోన్‌ కొనిచ్చిన తల్లి! ఆ కొడుకేమో..

4 Apr, 2022 14:03 IST|Sakshi
గుల్షన్‌ పదో తరగతి మెమో చూపిస్తు‍న్న సర్విలా దేవి.. పక్కన చిన్న కొడుకు

భర్త కాలం చేసింది చానారోజులే అయ్యింది. ఇద్దరు కొడుకులను బాగా చదివించేందుకు అహర్నిశలు కష్టపడేది ఆ తల్లి. కొడుకు సరస్వతి పుత్రుడు. అందుకే ఆన్‌లైన్‌ సదువుకు ఫోన్‌ కావాలని అడగ్గానే.. ఉన్న రెండు మేకలను అమ్మేసి కొడుకు చేతులో సొమ్ములు పెట్టింది ఆ తల్లి. కానీ, ఆ బిడ్డ.. ఆ తల్లి నమ్మకాన్ని మాత్రమే దెబ్బ తీయలేదు. కటకటాల పాలై జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడు కూడా.

బిహార్‌ నవాడా జిల్లా థాల్పోస్‌ గ్రామం ఈ మధ్య వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం.. ఆ ఊరి నుంచి సైబర్‌ నేరాలనుగానూ పోలీసులు అరెస్ట్‌ చేయడం. జిల్లావ్యాప్తంగా ఒకే తరహాలో జరిగిన స్కామ్‌లో మొత్తం 33 మందిని అరెస్ట్‌చేస్తే.. అందులో 31 మంది థాల్పోస్‌ గ్రామం నుంచే కావడం ఆశ్చర్యం కలిగించేదే కదా!. అందునా నేరాలకు పాల్పడింది 14 నుంచి 40 ఏళ్లలోపు వాళ్లే కావడం గమనార్హం. అందులో ఒకడే 19 ఏళ్ల గుల్షన్‌.
 
అరెస్ట్‌ అయిన చాలామంది ఈపాటికే బెయిల్‌ మీద బయటకు వచ్చారు. కొందరేమో ఆర్థిక స్థితి బాగోలేక జైల్లోనే ఉండిపోయారు. మరికొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలు అలాంటి పని చేశారంటే నమ్మలేకపోతున్నారు. గుల్షన్‌ తండ్రి చనిపోయాక అన్నితానై చూసుకుంది ఆ తల్లి. అలాగని గుల్షన్‌ సుద్దమొద్దు కాదు. 2019లో పదవ తరగతి ఫస్ట్‌ డివిజన్‌లో పాసయ్యాడు. ముఖ్యమంత్రి బాలక్‌ బాలికా ప్రోత్సాహన్‌ యోజన కింద 10 వేల రూపాయల స్కాలర్‌షిప్‌ కూడా అందుకున్నాడు. స్థానికంగా ట్యూషన్స్‌ చెబుతూ నెలకు మూడు వేల రూపాయలు సంపాదిస్తూ.. తల్లి, తమ్ముడి పోషణలో భాగం అయ్యాడు కూడా. అలాంటోడి జీవితాన్ని సెల్‌ఫోన్‌ దెబ్బ తీసింది. సులువుగా డబ్బు సంపాదించాలన్నా దుర్భుది.. అతని కుటుంబం పరువు తీయడంతో పాటు వ్యక్తిగతంగా ఆ కుర్రాడిని కటకటాల పాల్జేసింది. అతనికి బెయిల్‌ ఇప్పించే పరిస్థితిలోనూ లేదు 42 ఏళ్ల సర్విలా దేవి.

అరెస్ట్‌ అయిన చాలామందివి పేద కుటుంబాలే. కాస్తో కూస్తో చదువుకున్నారు. అప్పో సొప్పో చేసి స్మార్ట్‌ఫోన్లు కొని సైబర్‌నేరాలకు పాల్పడ్డారంతా. ఓటీపీ నేరాల దగ్గరి నుంచి, నకిలీ ఫోన్‌ కాల్స్‌, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే దాకా.. వాళ్లు పాల్పడి నేరాలంటూ లేవు. ఉన్నంత చదువు, ఆన్‌లైన్‌ మోసాలపై పెంచుకున్న జ్ఞానం వాళ్లతో నేరాలు చేయించింది. ఊరిలో ఎవరికీ అనుమానాలు రాకుండా.. పోలాల దగ్గర, బోరు బావిల దగ్గర, ఊళ్లో చెట్ల అరుగుల మీద కూర్చుని ఈ నేరాలకు పాల్పడ్డారని థాల్పోస్‌ ఎస్సై బెయిడ్‌నాథ్‌ ప్రసాద్‌ చెప్తున్నారు.

బీహార్‌లో నమోదు అయ్యే సైబర్‌ నేరాలు తక్కువేం కాదు. ఒక్క నవాడా జిల్లా పరిధిలో 2019-20 మధ్య 18 కేసులకుగానూ 28 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2020-21లో ఆ సంఖ్య 14 కేసులకు 30 మందికి చేరింది. కానీ, 2022లో అదీ మార్చి వరకే 11 కేసుల్లో 38 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇతర రాష్ట్రాల వాళ్లను లక్ష్యంగా చేసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నారంతా. పేదరికం, కరోనాతో ఉద్యోగాలు కోల్పోవడం, వలస కూలీలకు పనులు లేకపోవడం, బడిలు బంద్‌ కావడంతో చాలామంది ఇటువంటి నేరాల వైపు మళ్లుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేసులు నమోదు చేయకుండా.. కౌన్సెలింగ్‌ ద్వారా వీళ్లలో మార్పు తీసుకురావాలనే ఆలోచనలో ఉంది పోలీస్‌ శాఖ.

మరిన్ని వార్తలు