దొంగకు అంబపలికించారు.. కదిలే రైలులో ఫోన్‌ చోరీయత్నం.. తర్వాత అసలు ట్విస్ట్‌

29 Sep, 2022 16:00 IST|Sakshi

దొంగతనం.. ఎక్కడ చేసినా నేరమే. కొందరు తామే తోపులమంటూ చేతివాటం చూపిస్తుంటారు. క్షణాల్లో విలువైన వస్తువులు మాయం చేస్తుంటారు. ఇక బస్సులు, రైళ్లు వంటి రద్దీగా ఉండే ప్రదేశాల్లో దొంగలు చాకచక్యంగా దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఎంత తెలివిగా తప్పించుకున్నా కొన్నిసార్లు దొంగ దొరికిపోతుంటాడు. తాజాగా ఓ దొంగ రైల్వే స్టేషన్‌ నుంచి కదులుతున్న రైలులో మొబైల్‌ ఫోన్‌ చోరీకి  ప్రయత్నించి చివరికి ఊహించని విధంగా విఫలమయ్యాడు. దీంతో, రైలు ప్రయాణీలకులు దొంగకు చుక్కలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 

ఇటీవల బీహార్‌లోనే బెగుసరాయ్‌ నుంచి ఖగారియాకు వెళ్తున్న రైలులో ఓ దొంగ సెల్‌ఫోన్‌ దొంగలించచోయి ప్రయాణీకులకు చిక్కడంతో అతడికి చుక్కలు చూపించారు. తాజాగా మరో దొంగ సైతం ఇలాంటి దొంగతనానికే పాల్పడ్డాడు. ఈ వీడియోలో జమాల్‌పూర్-సాహిబ్‌గంజ్ ప్యాసింజర్ రైలు ఘోఘా స్టేషన్‌లో ఉండగా.. ఓ దొంగ రైలు కిటీకిలో నుంచి విండో సీట్‌లో ఉన్న ప్రయాణికుడి ఫోన్‌ లాక్కోవడానికి ప్రయత్నించాడు.

వెంటనే అప్రమత్తమైన ప్రయాణికుడు.. దొంగ చేతులను, టీ షర్టును కిటికీలోంచే గట్టిగా పట్టుకున్నాడు. రైలు కదలడం ప్రారంభమవ్వడంతో విడిచిపెట్టాలని ఎంత వేడుకున్నా ప్రయాణికులు మాత్రం చేతులు వదలలేదు. ఇలా రైలు కొంత దూరం ప్రయాణించాక.. దొంగను రైలులోపలికి లాగారు. అనంతరం అతడిని చితకబాదారు. తర్వాత, రైల్వే పోలీసులకు అప్పగించినట్టు సమాచారం. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు