-

బస్‌ టైర్ల కిందకు దూసుకెళ్లిన బైకర్‌.. హెల్మెట్‌ ఉండడంతో సేఫ్‌..

13 Dec, 2022 14:28 IST|Sakshi

బైక్‌పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ట్రాఫిక్‌ పోలీసులు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తున్నారు. జరిమానాలు సైతం విధిస్తున్నారు. కానీ, చాలా మంది హెల్మెట్‌ పెట్టుకునేందుకు ఇష్టపడటం లేదు. అయితే, అలాంటి వారు ఈ వీడియోను చూస్తే వారు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో, హెల్మెట్‌ వల్ల ఏ మేర ప్రయోజనం ఉందో తెలుస్తుంది. ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొచ్చి పడిపోయాడు. ఎదురుగా వస్తున్న బస్సు వెనకాల టైర్ల కిందకు దూసుకెళ్లాడు. హైల్మెట్‌ ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన గతంలో జరిగినా.. పాత వీడియోనే మరోమారు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను తాన్సుయోగెన్‌ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. బస్సును ఢీకొట్టిన బైకర్‌.. వెనక టైర్ల కిందకు దూసుకెళ్లాడు. తల టైర్‌ కిందకు వెళ్లింది. దీంతో హెల్మెట్‌ పగిలింది. అయితే, బైకర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తానే బస్‌ కింద నుంచి బయటకు రాగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 

ఈ వీడియోను చూసిన నెటిజన్లు హెల్మెట్‌ ఉండటం వల్లే అతడి ప్రాణాలు నిలిచాయని కామెంట్‌ చేశారు. ‘అతడు పెట్టుకున్న హెల్మెట్‌ బ్రాండ్‌ నాకు చెప్పండి ప్లీజ్‌..’ అంటూ ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. మరోవైపు.. ఆ హెల్మెట్‌ తయారు చేసిన సంస్థనే ప్రచారం కోసం ఇలాంటి వీడియోలు చేస్తుందని మరికొంత మంది పేర్కొన్నారు.

ఇదీ చదవండి: తవాంగ్‌ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్‌ జెట్స్‌ గస్తీ

మరిన్ని వార్తలు