బిల్కిస్‌ బానో దోషుల విడుదల కేసు విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం జడ్జీ

13 Dec, 2022 16:51 IST|Sakshi

న్యూఢిల్లీ: బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయటాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసు విచారణ ఇవాళ (డిసెంబర్‌ 13న) చేపట్టాల్సి ఉండగా.. జస్టిస్‌ బేలా ఎం త్రివేది విచారణ నుంచి తప్పుకున్నారు. దీంతో కేసు విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను కొత్త బెంచ్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

జస్టిస్‌ అజయ్‌ రాస్తోగి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ముందుకు మంగళవారం బిల్కిస్‌ బానో అత్యాచార దోషుల విడుదల పిటిషన్‌ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ కేసును జస్టిస్‌ బేలా ఎం త్రివేది విచారించాలనుకోవట్లేదని తెలిపారు మరో జడ్జీ జస్టిస్‌ అజయ్‌ రాస్తోగి. ‘ఈ ధర్మాసనం ముందుకు పిటిషన్‌ వచ్చినా.. అందులో ఒకరు తప్పుకున్నారు.’అని జస్టిస్‌ రాస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే, జస్టిస్‌ త్రివేది ఎందుకు తప్పుకున్నారనే విషయంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. 

2002 గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై పదకొండు మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె కుటుంబ సభ్యులతో సహా పలువురిని హత్య చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు అనంతరం నిందితులను దోషులుగా తేల్చిన ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఉన్నత, అత్యున్నత న్యాయస్థానాలు జోక్యం చేసుకుని.. జీవిత ఖైదుగా మార్చాయి. తాజాగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం రెమిషన్‌ పాలసీ ప్రకారం.. ఆ పదకొండు మందిని విడుదల చేసింది. ఆగస్టు 15న 11 మంది దోషులను విడుదల చేయటాన్ని రెండు వేరువేరు పిటిషన్ల ద్వారా సవాల్‌ చేశారు బిల్కిస్‌ బానో. సుప్రీం కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు.

ఇదీ చదవండి: 11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంలో పిటిషన్

మరిన్ని వార్తలు