రంధిక్పూర్‌లో నిశబ్ద వాతావరణం.. బిల్కిస్‌ బానో దోషులకు ఇదో రకం శిక్షా?

8 Sep, 2022 18:47 IST|Sakshi

గాంధీనగర్‌: బిల్కిస్‌ బానోస్‌ సామూహిక అత్యాచార కేసులో దోషులకు క్షమాభిక్ష.. తదనంతర సన్మాన ఘట్టం తీవ్ర విమర్శలకు దారి తీసింది. గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వాళ్లను మళ్లీ కటకటాల వెనక్కి పంపాలంటూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయి.  అయితే.. జైలు నుంచి విడుదలయ్యాక ఆ పదకొండు మందిలో చాలావరకు ఇప్పుడు పత్తా లేకుండా పోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోలీసులు మాత్రం వాళ్ల కదలికలపై నిఘా పెట్టి ఉంచగా.. సొంత వూరిలోనే అవమానాలు, ఛీత్కారాలు, బెదిరింపులతో భయంభయంగా గడుపుతున్నాయి దోషుల కుటుంబాలు. 

గుజరాత్‌లోని రంధిక్పూర్‌లో.. చాలావరకు దోషుల ఇళ్లకు తాళాలు ఉన్నాయ్‌. అక్కడంతా నిశబ్ద వాతావరణం నెలకొంది. తమ విడుదలపై విమర్శలు చెలరేడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ మళ్లీ అరెస్ట్‌ చేస్తారో.. అక్రమ కేసులు బనాయించి కటకటాల వెనక్కి నెడతారేమో అని ఊరి వదిలి పారిపోయినట్లు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు ఇచ్చిన వివరణ ద్వారా తెలుస్తోంది.

బిల్కిస్‌ బానోస్‌పై అఘాయిత్యం జరిగే సమయంలో.. శైలేష్‌ భట్‌ బీజేపీ క్రియాశీలకగా నేతగా ఉన్నాడు. ఆ సమయంలోనే శైలేష్‌ భట్‌, మిటేష్‌ భట్‌లు ఇళ్లలో ఉండేవాళ్లు కారని.. రాజకీయాలంటూ తిరిగేవాళ్లని చుట్టుపక్కల వాళ్లు చెప్తున్నారు. ఆగష్టు 15న రెమిషన్‌ మీద విడుదలయ్యాక ఈ ఇద్దరు ఇళ్లకు తాళాలు వేసుకుని ఎటో వెళ్లిపోయారు. 

మరో దోషి రాధేశ్యామ్‌ షా ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి. ఇక మరో నిందితుడు బకాభాయ్‌ ఇల్లు శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆ కుటుంబం మరో చోట గుడారం వేసుకుని జీవిస్తోంది. అయితే తన భర్త జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి గ్రామస్తులు కొందరు ఆయన్ని వెంబడించి.. ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని బకాభాయ్‌ భార్య మంగ్లీబెన్‌ చెబుతోంది. ఆ భయంతో తన భర్త బయటకు రావడం మానేశాడని ఆమె అంటోంది. అంతేకాదు.. తప్పుడు అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులు పెట్టి మళ్లీ జైలుకు పంపుతామంటూ కొందరు ఆయన్ని బెదిరిస్తున్నారని ఆమె వాపోతోంది.

దోషుల్లో నలుగురైదుగురిది మాత్రమే ఉన్నత కుటుంబాలు. మిగతా కుటుంబాలు కూలీనాలీ చేసుకుని బతికేవే!. గ్రామస్థుల నుంచి ప్రత్యేకించి ముస్లిం కమ్యూనిటీ నుంచి దోషుల కుటుంబాలపై అప్రకటిత బహిష్కరణ నడుస్తోంది. అప్పటిదాకా కూలీనాలీ పనులు చేసుకుంటూ పోతున్న ఆ కుటుంబాలకు(ఐదారు).. వాళ్లు విడుదలయ్యాక ఉపాధి లేకుండా పోయింది. వెలివేత, చిన్నచూపు తప్పడం లేదు. తప్పు చేసింది ఒకరైతే.. శిక్ష తాము అనుభవించాల్సి వస్తోందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు ఇప్పుడు.

ఇదీ చదవండి: బొగ్గు కుంభకోణం: ఇప్పుడు ఆ మంత్రిపై సీబీ‘ఐ’

మరిన్ని వార్తలు