11 మంది అత్యాచార దోషుల విడుదలను సవాల్ చేసిన బిల్కిస్ బానో.. సుప్రీంలో పిటిషన్

30 Nov, 2022 14:31 IST|Sakshi

న్యూఢిల్లీ: తనపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 1992 ఉపశమన నిబంధనలకు ఈ కేసుకు వర్తింపజేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మేలో అనుమతివ్వడాన్ని ఆమె వ్యతిరేకించారు.

అలాగే 11 మంది దోషులను ముందుగానే విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె మరో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను ఒకేసారి, ఒకే ధర్మాసనం విచారించే విషయాన్ని పరిశీలిస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.

2002 గుజరాత్ ‍అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె మూడెళ్ల కుమార్తె సహా కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా హత్య చేశారు. అప్పుడు ఆమె వయసు 21 ఏళ్లు. ఐదు నెలల గర్భవతి కూడా.

ఈ దారుణ ఘటనలో 11 మందిని దోషులుగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. అయితే 15 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్న వీరిని ఈ ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'

మరిన్ని వార్తలు