నమ్మకం పోయింది.. జీవితాంతం భయంతో మనశ్శాంతి లేకుండా బతకాల్సిందేనా?: దోషుల విడుదలపై బిల్కిస్‌ ఆవేదన

18 Aug, 2022 07:30 IST|Sakshi

తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దోషులను రెమిషన్‌ కింద విడుదల చేయడంపై బిల్కిస్ యాకూబ్‌ రసూల్‌ అలియాస్‌ బిల్కిస్‌ బానో స్పందించారు. న్యాయవ్యవస్థ పట్ల తనకున్న నమ్మకాన్ని ఈ నిర్ణయం చెదరగొట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్‌ ప్రభుత్వం తనను మోసం చేసిందని, ఆ నిర్ణయం బాధించిందని, ఇంతకాలం అభద్రతాభావంతో బతికిన తాను ఇకపైనా భయంభయంగా బతకాల్సిందేనా? అంటూ ప్రశ్నిస్తున్నారామె. 

‘‘న్యాయస్థానాలు పవిత్రమైనవి నమ్మాను. కానీ, ఏ మహిళకైనా న్యాయపరిధిలో ఇలాంటి ముగింపు దక్కుతుందా?. నేను వ్యవస్థను నమ్మాను. అందుకే గాయంతోనే జీవించడం నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. నా ఈ బాధ, అస్థిరమైన విశ్వాసం నా ఒక్కదానిదే కాదు.. న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి స్త్రీది అని ఆమె పేర్కొన్నారు. 

ఇది అన్యాయం. నా భద్రత, బాగోగుల గురించి పట్టింపులేదన్నట్లు గుజరాత్‌ ప్రభుత్వం వ్యవహరించింది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలిని సంప్రదించాలన్న స్పృహ గుజరాత్‌ ప్రభుత్వానికి లేకపోవడం విడ్డూరం. గుజరాత్‌ ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఒక్కటే.. భయాందోళనలు లేకుండా మనశ్శాంతిగా బతికే నా హక్కును నాకు ఇవ్వమని. నన్ను, నా కుటుంబానికి రక్షణ కల్పించమని అని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. 

జైల్లో ఉన్నా భయంగానే.. 
బిల్కిస్‌ బానో పోరాటం పద్దెనిమిదేళ్ల పైనే కొనసాగింది. ఈ సమయంలో ఆమె ఒక చోట స్థిరంగా ఉండలేదు. దోషుల కుటుంబాల నుంచి హాని పొంచి ఉండడంతో అజ్ఞాతంలో కొన్నాళ్లు, ఆపై క్రమంతప్పకుండా ఇళ్లను మారుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు నిందితుల విడుదలతో ఆమెలో మరింత ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది శోభా గుప్తా చెప్తున్నారు. నిందితుల విడుదల వ్యవహారంపై న్యాయ పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారామె. 


గుజరాత్‌ వీహెచ్‌పీ ఆఫీస్‌లో సన్మానం అందుకున్న బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసు దోషులు

బిల్కిస్‌ బానో కేసు
2002 గుజరాత్‌ గోద్రా అల్లర్ల అనంతర పరిణామాల్లో.. దాహోద్‌ జిల్లా లింఖేధా మండలం రంధిక్‌పూర్‌లో.. మూక దాడులు జరిగాయి. దొరికిన వాళ్లను దొరికినట్లు హతమార్చడంతో పాటు సామూహిక అత్యాచారాలకు పాల్పడ్డారు. బిల్కిస్‌ బానోస్‌ కుటుంబంపైనా దాడి జరిగింది. ఐదు నెలల గర్భవతిగా ఉన్న ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్‌ కుటుంబ సభ్యులు ఏడుగురిని(బిల్కిస్‌ మూడేళ్ల కూతురిని సహా) హతమార్చారు. ఆ సమయానికి బిల్కిస్‌ వయసు 21 ఏళ్లు.  ఆ దాడుల్లో ప్రాణాలతో బయటపడింది బిల్కిస్‌, ఓ వ్యక్తి, మూడేళ్ల ఓ చిన్నారి మాత్రమే. 

ఈ కేసులో 2008, జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేలుస్తూ శిక్ష విధించింది. దీన్ని సవాలు చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ బిల్కిస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేసును సుప్రీంకోర్టు అహ్మదాబాద్‌ నుంచి బాంబే హైకోర్టుకు బదలాయించింది. ఇది అత్యంత అరుదైన కేసని, ప్రధాన నిందితులైన జశ్వంత్‌భాయ్, గోవింద్‌భాయ్, రాధేశ్యాంలకు ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అయితే.. కింది కోర్టు ఇచ్చిన జీవిత ఖైదు తీర్పును సమర్థించి బాంబే హైకోర్టు. 

1992 పాలసీ ప్రకారం..
75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా.. బిల్కిస్‌ బానో సామూహిక అత్యాచార కేసులో నిందితులను రెమిషన్‌ కింద విడుదల చేసింది గుజరాత్‌ ప్రభుత్వం. దీంతో దేశం మొత్తం భగ్గుమంది. రేపిస్టులు.. నరహంతకులను విడుదల చేయడంపై రాజకీయ నేతల దగ్గరి నుంచి సామాన్యుల దాకా సోషల్‌ మీడియాలో గుజరాత్‌ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. రెమిషన్‌ పాలసీ 2014 ప్రకారం.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయకూడదు.  అయితే గుజరాత్‌ ప్రభుత్వం మాత్రం దోషులకు 2008లో శిక్ష పడిందని, ‘సుప్రీం కోర్టు ఆదేశాలానుసారం 1992 పాలసీ ప్రకారం’ వాళ్ల విడుదల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని విడుదల చేశామని తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.

ఇదీ చదవండి: అసలు ‘బిల్కిస్‌’ దోషుల విడుదలకు కేంద్రం అనుమతి ఉందా?

మరిన్ని వార్తలు