కోవిడ్‌ చికిత్సకు కొత్త ఆయుధం!

3 Oct, 2020 10:26 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు ఇంకో ఆయుధం దొరికింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్‌ –ఈ సంస్థ ఈ ఘనతను సాధించింది. కోవిడ్‌ బారిన పడ్డ వారి రక్తం నుంచి యాంటీబాడీలతో కూడిన ప్లాస్మా గురించి మనం వినే ఉంటాం. పలు ప్రాంతాల్లో కోవిడ్‌ చికిత్స కోసం ప్లాస్మా థెరపీని వినియోగిస్తున్నారు కూడా. అయితే బయోలాజికల్‌ –2 సంస్థ మనుషుల ప్లాస్మా స్థానంలో గుర్రాల నుంచి సేకరించిన ప్లాస్మాను వినియోగించడం విశేషం. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌ను గుర్రాల్లోకి ఎక్కించి.. యాంటీబాడీలు ఉత్పత్తి అయిన తరువాత సేకరించి శుద్ధి చేస్తారు. ఈ కొత్త పద్ధతిపై మానవ ప్రయోగాలు ఇంకా జరగాల్సి ఉందని, త్వరలోనే డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాను ఈ విషయమై సంప్రదిస్తామని భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌) శాస్త్రవేత్త సమైరన్‌ పాండా తెలిపారు.

గుర్రం నుంచి వేరు చేసి శుద్ధి చేసిన రక్తంలో శక్తిమంతమైన యాంటీబాడీలు ఉంటాయని, వైరస్‌ బారిన పడ్డ వారికి నేరుగా అందివ్వవచ్చునని అంచనా. గతంలోనూ పలు వైరస్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల కోసం జంతువుల రక్తంలో యాంటీబాడీలను వృద్ధి చేసి వాడారు. కోవిడ్‌ రోగుల రక్తం నుంచి వేరు చేసిన ప్లాస్మాతో పోలిస్తే గుర్రపు సీరమ్‌లో యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయని, వైరస్‌ను వేగంగా చంపగల సామర్థ్యం కలిగి ఉంటాయని ఐసీఎంఆర్‌ తెలిపింది. అధ్యయనంలో భాగంగా పది గుర్రాలకు నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌ను ఎక్కించి 21 రోజుల తరువాత దాని ప్లాస్మాను పరీక్షించారు. ఈ ప్లాస్మాలో ఐజీజీ యాంటీబాడీలు ఉన్నట్లు స్పష్టమైంది. (చదవండి: కోవిడ్‌ టీకా వచ్చే ఏడాదికి అనుమానమే)

మరిన్ని వార్తలు