నేపాల్‌, శ్రీలంకలో కూడా బీజేపీ ప్రభుత్వం! 

15 Feb, 2021 11:14 IST|Sakshi
త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

త్రిపుర ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

అగర్తల: వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తరచుగా వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ కుమార్‌ మరో సారి టాక్‌ ఆఫ్‌ ది స్టేట్‌ అయ్యారు. బీజేపీ విదేశాల్లో కూడా అధికారంలోకి వస్తుందని.. ఇందుకు గాను కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తగిన వ్యూహ రచన చేస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు విప్లవ్‌ దేవ్‌. రాజధాని అగర్తలాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశం సందర్భంగా విప్లవ్‌ దేవ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 

విప్లవ్‌ దేవ్‌ మాట్లాడుతూ.. ‘‘అమిత్‌ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఒకసారి మన రాష్ట్రానికి అతిథిగా వచ్చారు. ఆ సమయంలో మనలో ఒకరు.. నాకు తెలిసి అజయ్‌ జమ్‌వాల్‌(ఈశాన్య జోనల్‌ బీజేపీ సెక్రటరీ) అనుకుంటా అమిత్‌ షాతో ‘‘ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకు అభినందనలు తెలుపుతున్నాను’’ అన్నారు. అందుకు అమిత్‌ షా.. ‘‘శ్రీలంక, నేపాల్‌ మిగిలి ఉన్నాయి. పార్టీని అక్కడ కూడా విస్తరించి.. నేపాల్‌, శ్రీలంకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు’’ అంటూ విప్లవ్‌ దేవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విప్లవ్‌ దేవ్‌ మాట్లాడుతూ.. ‘‘కేరళలలో గత కొన్నేళ్లుగా పాతుకుపోయిన పాత సంప్రదాయాన్ని బీజేపీ మార్చనుంది. గతంలో కేరళలో ఐదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే.. తరువాతి 5 సంవత్సరాలు లెఫ్ట్‌ అధికారంలో ఉండేది. బీజేపీ ఈ పద్దతిని మార్చనుంది. త్వరలోనే పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయనుంది’’ అని తెలిపారు. ఇక ఇలాంటి వింత వింత వ్యాఖ్యలు చేయడంలో విప్లవ్‌ దేవ్‌ ముందు వరుసలో ఉంటారు. మూడేళ్ల క్రితం భారతదేశంలో ఇంటర్నెట్‌ వినియోగం మహాభారత కాలం నుంచే ఉందన్నారు విప్లవ్‌ దేవ్‌. సంజయుడు యుద్ధ భూమిని సందర్శించకుండానే.. అక్కడ ఏం జరుగుతుందనే వివరాల్ని ధృతరాష్ట్రుడికి వివరించాడని.. ఇదంతా ఇంటర్నెట్‌ వల్లనే అని.. అప్పటి నుంచి భారత్‌లో నెట్‌ వినయోగం ఉందన్నారు విప్లవ్‌ దేవ్‌. 

చదవండి: బెంగాలీలతో సరితూగలేరు; ఇది సిగ్గుచేటు!
              ‘దీదీ భయపడింది.. అందుకే ఆ నిర్ణయం’

మరిన్ని వార్తలు