కాకి చనిపోయింది.. కోట మూసేశారు

20 Jan, 2021 08:05 IST|Sakshi

బర్డ్‌ఫ్లూ నేపథ్యంలో 26 వరకు ఎర్రకోట బంద్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ఎర్రకోట మీద ఓ కాకి చనిపోయింది... పరీక్షలు నిర్వహిస్తే కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలింది. దీంతో ఈ నెల 26 వరకు ఎర్రకోట మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రకటన చేశారు. ఈ నెల 10న సుమారు 15 కాకులు ఎర్రకోట ప్రాంగణంలో మృతిచెందడాన్ని అధికారులు గుర్తించారు. జలంధర్‌లోని లేబరేటరీకి పరీక్షల నిమిత్తం వాటిని పంపించగా ఒక కాకికి బర్డ్‌ఫ్లూ సోకిందని తేలిందని ఢిల్లీ ప్రభుత్వ  పశు సంరక్షణ విభాగం డైరెక్టర్‌ రాకేష్‌ సింగ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్‌ డే రోజైన ఈ నెల 26 వరకు సందర్శకులను ఎర్రకోట లోపలికి అనుమతించడం లేదని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో ఒక గూడ్లగూబ మృతదేహం పరీక్షించగా దానికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్థారణ అయిందని అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు