నయా మోసం: ఒక వధువు, ఐదుగురు పెళ్లి కుమారులు!

29 Mar, 2021 16:01 IST|Sakshi

భోపాల్‌: పెళ్లి పేరిట ముగ్గురు కలిసి ఐదుగురిని మోసం చేసిన ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. ఒక వరుడు పెళ్లి చేసుకుందామని మండపానికి వెళ్లగా షాక్‌ తగిలింది. పెళ్లి కుమార్తె కనిపించలేదు. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చింది. దీంతో సదరు వరుడు నేరుగా పోలీస్‌స్టేషన్‌ చేరగా అక్కడ అతడిలాంటి వ్యక్తులు మరో నలుగురు ఉన్నారు. దీంతో ‘ఒక వధువు.. ఐదుగురు పెళ్లి కుమారులు’ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. తీరా ఆరా తీస్తే ఒకే యువతి ఆ ఐదుగురిని మోసం చేసిందని తెలిసీ అందరూ షాక్‌కు గురయ్యారు.

హర్దా జిల్లాలో ఓ వ్యక్తికి పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లికి అంతా సిద్ధమైంది. ముహుర్తం నిర్ణయించారు.. ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేశారు.. పెళ్లి చేసుకుందామని వరుడు, తన కుటుంబం, బంధువర్గంతో కలిసి ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లగా అక్కడ తాళం వేసి ఉంది. దీంతో కంగారుపడిన అతడు వెంటనే వధువుకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఎన్నిసార్లు చేసినా స్విచ్ఛాఫే రావడంతో మోస పోయామని గుర్తించి కోలార్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

అక్కడికి వెళ్లాక వారు ఖంగుతినే సీన్‌ కనిపించింది. తనలాగ మోసపోయిన నలుగురు పెళ్లి కుమారులు అక్కడ కనిపించారు. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. దీనిపై పోలీసులు వివరాలు సేకరించగా.. ఆ ఐదుగురిని మోసం చేసింది ఒక్కరేనని తేలింది. పెళ్లి చేసుకుందామని ఐదుగురికి ఒకే రోజు ఆ వధువుగా ఉన్న యువతి వారిని నమ్మించింది. దీంతో అది నమ్మిన ఆ ఐదుగురు పెళ్లి మండపానికి రాగా ఆమె అసలు బండారం బయటపడింది. దీని వివరాలు పోలీస్‌ అధికారి భూపేంద్ర సింగ్‌ తెలిపారు. 

‘మోసం చేసింది ముగ్గురు అని గుర్తించాం. వారు ఓ గ్యాంగ్‌గా మారి పెళ్లి కాని యువకులను ఈ విధంగా వలలో వేసుకుని మోసం చేస్తుంటారు. వారిని ఇప్పటికే అరెస్ట్‌ చేశాం’ అని భూపేంద్ర సింగ్‌ వివరించారు. అయితే ఇలాంటి మోసాలు ఆ గ్యాంగ్‌ తరచూ చేస్తుంటారని చెప్పారు. పెళ్లి కాని యువకులను గుర్తించి వారికి నంబర్లు ఇచ్చి ఓ యువతిని చూపించ్చి మెల్లగా మోసానికి పాల్పడుతుంటారని తెలిపారు. ఆ విధంగా పెళ్లి కొడుకుల నుంచి రూ.20 వేలు వసూలు చేసి ఉడాయిస్తారు అని ఆ పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్న వారిపట్ల యువకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు