లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

12 May, 2023 06:15 IST|Sakshi

ప్రధానితో భేటీ తర్వాత నవీన్‌ పట్నాయక్‌ స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో బిజు జనతా దళ్‌ (బీజేడీ) ఒంటరి పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్పష్టం చేశారు. గురువారం ప్రధాని మోదీని కలిసి మంతనాలు జరిపారు. బీజేపీకి, కాంగ్రెస్‌కి సమానదూరం పాటిస్తానని తర్వాత మీడియాతో పట్నాయక్‌ చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం కోసం బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నవీన్‌ పట్నాయక్‌ను కలుసుకున్న మర్నాడే ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతామని తేల్చి చెప్పడం విశేషం. నితీశ్‌ భువనేశ్వర్‌కు వచ్చి తనను మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పట్నాయక్‌ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్‌ పట్నాయక్‌ అప్పట్నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య వచ్చే వివాదాస్పద అంశాల్లో తటస్థ వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు.

మరిన్ని వార్తలు