విపక్షాలకు నవీన్‌ పట్నాయక్‌ ఝలక్‌.. చేతులు కలపబోనని స్పష్టీకరణ

11 May, 2023 19:01 IST|Sakshi

ఢిల్లీ: బిజూ జనతా దళ్ పార్టీ చీఫ్‌, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విపక్షాలకు ఝలక్‌ ఇచ్చారు. 2024 ఎన్నికలకు విపక్షాలతో తన పార్టీ చేతులు కలపబోదని, ఒంటరిగానే ముందుకు వెళ్తామని ప్రకటించారు. 

ఒడిషా సీఎం నవీన్‌ పట్నాయక్‌.. ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పూరిలో ఎయిర్‌పోర్ట్‌కు సంబంధించి తాను ప్రధానిని కలిశానని, అందుకు ప్రధాని కూడా సహకరిస్తానని హామీ ఇచ్చారనే విషయాన్ని ఆయన మీడియాకు తెలిపారు. అయితే.. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా ఆయన స్పందించారు. 

2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేడీ విపక్షాలతో కలవదు. మా పార్టీ ఎప్పుడూ ప్రణాళిక బద్దంగానే ముందుకు సాగుతుంది అని తెలిపారు. అలాగే.. తన ఢిల్లీ పర్యటనలో ఏ రాజకీయ పార్టీతోనూ భేటీ కాబోనని వెల్లడించారాయన. తనకు తెలిసినంత వరకు థర్డ్‌ ఫ్రంట్‌ అవకాశమే లేదని పేర్కొన్నారాయన.

ఇదిలా ఉంటే.. రెండు రోజుల కిందట బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, పట్నాయక్‌తో భేటీ అయ్యారు. దీంతో పొత్తులపై భేటీ అనే ప్రచారం జరగ్గా.. పట్నాయక్‌ దానిని ఖండించారు. తదనంతరం ఇవాళ ఢిల్లీకి వెళ్లిన ఒడిషా సీఎం.. పలు పార్టీల నేతలతో భేటీ అవుతారనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. అయితే ఆ అంచనాలను పటాపంచల్‌ చేస్తూ అసలు విపక్షాలతో చేతులు కలపబోనని, థర్డ్‌ ఫ్రంట్‌కు ఆస్కారం ఉండబోదంటూ నవీన్‌ పట్నాయక్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. 

మరోవైపు మూడో కూటమి కోసం బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ విపరీతమైన ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపక్షాల నేతలను కలుస్తూ వస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ భేటీ కావడం, మరోవైపు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌, జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్.. ఇలా  వరుసగా నేతల భేటీ నేపథ్యంలో విపక్షాల ఆధ్వర్యంలో మూడో కూటమికి ఆస్కారం ఉందన్న చర్చ తెర మీదకు వచ్చింది.

మరిన్ని వార్తలు